బాల్కొండ (నిజామాబాద్): ఇద్దరు కలిసిమెలిసి బతికారు. అన్నింటా ఒక్కటై మెలిగారు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలో కరోనా మహమ్మారి ప్రవేశించింది. ఒకరిని బలిగొంది. నువ్వు లేని ఈ జీవితంలో నేను ఉండలేనంటూ మరో మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మెండోరా మండలం పోచంపాడ్‌లో నివాసం ఉండే తిమ్మాన్‌పల్లి శ్రీనివాస్ (31), కంచు రవి (31) స్నేహితులు. కాలనీలో డెయిరీ ఫాం పెట్టుకుని పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ 15 రోజుల క్రితం కరోనాతో మృతి చెందాడు. దీంతో రవి మానసికంగా కుంగిపోయాడు.
వారం క్రితం రెండు చేతులను కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అప్పటి నుంచి రవిని ఒంటరిగా వదిలేయకుండా కుటుంబసభ్యుల కోరిక మేరకు కొందరు మిత్రులు తమ వెంట తిప్పుకుంటున్నారు. అయినప్పటికీ రవి మానసిక స్థితిలో మార్పురాలేదు. తాను ఎప్పటికైనా తన స్నేహితుడు శ్రీనివాస్ వద్దకు వెళ్తానని వారితో చెప్పేవాడు. రవి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. రవికి భార్య, ఆరు నెలల కూతురు ఉన్నారు. మెండోరా ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ తండ్రి రామస్వామి గతనెల 28న కరోనాతో మృతి చెందాడు.
సారీ మమత.. మై క్యూట్ బేబీ
తన స్నేహితుడు శ్రీనివాస్ సమాధి పక్కనే తనను పూడ్చి పెట్టాలని రవి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ‘నా ప్రాణ స్నేహితుడు శ్రీను మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ లేని జీవితం నాకు వద్దు. సారీ మమత అండ్ మై క్యూట్ బేబీ’అంటూ భార్య, కుమార్తెను ఉద్దేశించి రాశాడు. రవి కోరిక ప్రకారం శ్రీనివాస్ సమాధి పక్కనే కుటుంబ సభ్యులు సమాధి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment