
శివశంకర్ (ఫైల్)
సాక్షి, ప్యాపిలి( కర్నూలు): ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రేయసి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్యాపిలిలో చోటుచేసుకుంది. పట్టణంలోని సేసేపేటలో నివాసం ఉంటున్న మాసాని ప్రసాద్, వరలక్ష్మి దంపతుల కుమారుడు శివశంకర్ (26) మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బీటెక్ చదివిన శివశంకర్ పట్టణ సమీపంలోని అరుణాచల ట్రాన్స్‌పోర్టులో పని చేస్తున్నాడు.
కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్న శివశంకర్ తరచూ ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు వారి వివాహానికి అంగీకరించారు. అయితే ప్రేమించిన ప్రేయసి మాత్రం పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు.
మృతుడి తండ్రి ప్రసాద్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెల వివాహం కాగా, తల్లి కుమారుడిపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తూ వచ్చింది. చేతికి వచ్చిన కుమారుడు విగతజీవిగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment