ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం
న్యూఢిల్లీ: ప్రముఖ విదేశీ యూనివర్సిటీలో చదువుతున్నానని, ఫ్లైట్ మిస్ కావడంతో వేరే విమానంలో సొంతూరు వెళ్లేందుకు డబ్బు సాయం చేయాలని మోసం చేస్తున్న ఓ యువకుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మోదెల వెంకట దినేశ్‌కుమార్ నాలుగైదేళ్లుగా ఈ దందా చేస్తూ 100 మందికి పైగా ప్రయాణికులను మోసగించినట్లు అధికారులు తెలిపారు.
ఓ వ్యక్తి డిసెంబర్ 19న బరోడా నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. టెర్మినల్–3 వద్ద ఉన్న ఆయన్ను దినేశ్ మాటల్లోకి దించాడు. విదేశీ వర్సిటీ విద్యార్థినని పరిచయం చేసుకుని సొంతూరు విశాఖపట్టణం వెళ్లే విమానం మిస్సయిందని టికెట్‌ను చూపించాడు. మరో ఫ్లైట్‌లో వెళ్లాలంటే తన వద్ద ఉన్న రూ.6,500 సరిపోవని, విశాఖకు టికెట్ ఖరీదు రూ.15వేలు ఉంటుందని చెప్పాడు.
ఇంటికి వెళ్లాక తిరిగి పంపిస్తానంటూ నమ్మబలికి ఆయన వద్ద నుంచి రూ.9,250 తన బ్యాంకు అకౌంట్‌కు గూగుల్ పేద్వారా వేయించుకున్నాడు. తర్వాత ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 30న దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment