![Medical student deceased in Rajendranagar - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/10/suicide.jpg.webp?itok=FZDt9uvx)
ప్రతీకాత్మక చిత్రం
రాజేంద్రనగర్: ఓ వైద్య విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రానికి చెందిన సెల్వన్ కుటుంబం వ్యాపార నిమిత్తం 2005వ సంవత్సరంలో నగరానికి వలస వచ్చారు. హైదర్‌గూడ న్యూఫ్రెండ్స్ కాలనీలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు.
సెల్వన్ దంపతులకు వినీషా(21) ఒక్కతే కూతురు. ఆమె మొయినాబాద్‌లోని భాస్కర కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం తన రూమ్‌లోకి వెళ్లిన వినీషా సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించింది. స్థానికులు అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
నెలరోజులుగా డిప్రెషన్‌లో ఉంది: తండ్రి
తండ్రి సెల్వన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజులుగా తమ కుమార్తె డిప్రెషన్‌లో ఉందని, కాలేజీలోని స్నేహితులతో తరచు మాట్లాడుతూ ఏదో విషయమై బాధపడుతోందని సెల్వన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినీషా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే దానికి లాక్ ఉండడంతో తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment