వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
భోజనం కోసం బయటకు వెళ్తుండగా అడ్డుకొని అఘాయిత్యం
దుర్గాపూర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో ఘటన
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైద్య కళాశాల విద్యార్థినిపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుర్గాపూర్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన బాధిత విద్యార్థిని ఇదే కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది.
రాత్రి సమయంలో భోజనం కోసం స్నేహితుడితో కలిసి క్యాంపస్ బయటకు వెళ్తుండగా, దుండగులు అడ్డుకొని సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
2024 ఆగస్టు 9న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏడాది తర్వాత మళ్లీ అలాంటి సంఘటనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీ ప్రభుత్వం అసమర్థత వల్లే బెంగాల్‌లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటనను రాజకీయం చేయొద్దని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోరింది.
అసలేం జరిగింది?
పోలీసుల ప్రాథమిక విచారణ పూర్తిచేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత విద్యార్థిని శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లేందుకు బయలుదేరింది. గేటు వద్దకు చేరుకోగానే ముగ్గురు వ్యక్తులు వారిని అటకాయించారు. దాంతో ఆ మిత్రుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఒంటరిగా మిగిలిన బాధితురాలిని ఆసుపత్రి వెనుక భాగంలోని చెట్లపొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె ఫోన్‌ను లాక్కున్నారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు బయటకు వచ్చింది. అప్పటికే తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స ప్రారంభించారు.
జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) బృందం ఆసుపత్రికి చేరుకొని బాధితురాలిని పరామర్శించింది. అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి బాధితురాలి తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. న్యాయం జరిగేలా కృషి చేస్తామని హమీ ఇచ్చారు. వైద్య విద్యార్థిపై జరిగిన దురాగతాన్ని పశ్చిమ బెంగాల్ డాక్టర్ల ఫోరం ఖండించింది. కాలేజీ క్యాంపస్‌లో కూడా రక్షణ లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేసింది. బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ సైతం స్పందించారు. ఐక్యూ మెడికల్ కాలేజీలో అత్యాచార ఘటన జరిగిందని, వసిఫ్ అలీతోపాటు అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. విద్యార్థినిపై దుశ్చర్య పట్ల నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది.


