
చాంద్రాయణగుట్ట: ఇంట్లో గొడవ పడిన ఓ గృహిణి నలుగురు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ రుద్ర భాస్కర్ కథనం ప్రకారం....నర్కీపూల్‌బాగ్‌కు చెందిన మహ్మద్ అక్బర్, షైనాజ్ బేగం (35) దంపతులు. వీరికి అఫ్రీన్ (13), రెహ్మత్ బేగం (11), మహ్మదా బేగం (9), మహ్మద్ రిజ్వాన్ (8) సంతానం. కాగా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు షైనాజ్ బేగం అత్తతో గొడవపడింది. కొద్దిసేపటికే ఇంట్లో వారికి చెప్పకుండా తన నలుగురు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి వరకు కూడా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వారి కోసం పలుచోట్ల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భర్త అక్బర్ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆచూకీ తెలిసిన వారు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో లేదా.. నం. 9490616823కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.