సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితులను నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిన్వివగా, బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
18 మందికి మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. సినీ రంగానికి చెందిన పలువురికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు.
చదవండి: పెరుగు అడిగితే చంపేశారు!
కాగా, టీఎస్–నాబ్ అధికారులకు గుడిమల్కాపూర్‌లో దొరికిన డ్రగ్స్ తీగ లాగితే... మాదాపూర్ విఠల్‌నగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీ డొంక కదిలింది. ఈ వ్యవహారంలో ఓ ఫిల్మ్ ఫైనాన్షియర్ సహా ముగ్గురిని పట్టుకున్న సంగతి తెలిసిందే.
నెల్లూరుకు చెందిన బి.బాలాజీ ఇండియన్ నేవీలో పనిచేస్తుండగా, కంటికి తీవ్రమైన గాయమైంది. మెడికల్లీ అన్‌ఫిట్ కావడంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి మాదాపూర్ అపార్ట్‌మెంట్‌లోని సర్వీస్ ఫ్లాట్‌లో జరిగే రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా హైదరాబాద్‌తోపాటు బెంగుళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్స్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి.
ఆపై రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడం బాలాజీకి వ్యాపకంగా మారింది. స్నేహితులతో పాటు పరిచయస్తుల కోసం నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌ల్లో వీటిని నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న నైజీరియన్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వారి నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసేవాడు. ఆపై పార్టీలు నిర్వహిస్తూ, విక్రయాలు ప్రారంభించాడు. బాలాజీ ఖాతాదారుల్లో సినీరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.
గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకట రత్నారెడ్డి గతంలో జూబ్లీహిల్స్ పరిధిలో ఓ గెస్ట్‌హౌస్ లీజుకు తీసుకున్నాడు. ఇందులో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో అప్పట్లో పోలీసులు దాడి చేయగా, నిర్వాహకులు పరారయ్యారు. ఈ కేసులో చిక్కిన వెంకట రత్నారెడ్డి ఆపై అమెరికా వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగిన వచ్చిన తర్వాత తన సన్నిహితులకు సంబంధించిన ప్రొడక్షన్ సంస్థ నిర్వహిస్తూ ఫిల్మ్ ఫైనాన్షియర్‌గా మారాడు.
డమరుకం, కిక్, బిజినెస్‌మ్యాన్, లవ్లీ, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీలకు వెళ్లడం అలవాటైంది. రేవ్ పార్టీలు నిర్వహించే వారికి ఫైనాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా బాలాజీతో కూడా పరిచయం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లతో పాటు విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన బాలాజీ వీటిలో కొన్నింటిని వెంకట రత్నారెడ్డికి అందించాడు. ఈ మాదకద్రవ్యాలతో మాదాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు.
రేవ్ పార్టీకి హాజరుకావడానికి మరికొన్ని మాదకద్రవ్యాలను తీసుకొని వస్తున్న బాలాజీ కదలికలపై టీఎస్–నాబ్‌కు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్ పి.రాజేష్‌లతో కూడిన బృందం వలపన్ని పట్టుకుంది. బాలాజీ వద్ద నుంచి కొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ప్రశ్నించగా, సర్వీస్ ఫ్లాట్ విషయం చెప్పా డు. దీంతో పోలీసులు ఆ ఫ్లాట్ పై దాడి చేశారు.
అక్కడ వెంకట రత్నారెడ్డితో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పనిచేస్తున్న డి.మురళి పట్టుబడ్డాడు. మద్యంమత్తులో మ్యూజిక్ పెట్టుకుని చిందులు వేస్తున్న వీరు డైనింగ్ టేబుల్‌పై ప్లేట్‌లో ఉంచిన కొకైన్‌ను కరెన్సీ నోటు సాయంతో ముక్కులోకి పీలుస్తున్నారు. వీరి వద్ద టీఎస్–నాబ్ బృందం 2.8 గ్రాముల కొకైన్, ఆరు ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్, 25ఎక్స్‌టసీ పిల్స్, రెండు ప్యాకెట్ల గాంజా, రూ.72,500 నగదు, రెండు కార్లు, ఐదుసెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.32.89 లక్షలుగా నిర్థారించారు.
డ్రగ్ పెడ్లర్‌గా మారిన బాలాజీ కస్టమర్లలో సినీరంగానికి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు కొందరు నటీనటులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్లందరితో బాలాజీ సోషల్‌మీడియా యాప్ స్నాప్‌చాట్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. సందేశాలు, కాల్స్ అన్నీ దీని ద్వారానే చేసేవాడు. ఇందులో వారివారి కాంటాక్ట్స్ ర్యాంబో, కిమ్స్, కింగ్, క్యాచీ, సూపర్ వంటి కోడ్ నేమ్స్‌తో ఉన్నాయి.
ఆ కాంటాక్ట్స్‌లో ఫోన్‌నంబర్లు సహా ఇతర వివరాలు కనిపించకపోవడంతో వారిని గుర్తించడానికి లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక వివరాలను బట్టి 18 మందిని కస్టమర్లుగా గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకొచ్చాడు. వీళ్లిద్దరూ సైతం ఆ అపార్ట్‌మెంట్‌లోని సర్వీస్ ఫ్లాట్‌లో పోలీసులకు చిక్కారు.
Comments
Please login to add a commentAdd a comment