
శాంతినగర్ (అలంపూర్): వివాహమైన రోజు రాత్రే వరుడు ఆత్మహత్యకు పాల్పడటం.. జోగుళాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించింది. పెళ్లికూతురు పుస్తెలతాడు, మెట్టెలు, పెళ్లిచీర వదిలేసి పుట్టినింటికి వెళ్లిపోవడంతో వరుడి కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వడ్డేపల్లి మండలం తనగలకు చెందిన సూర్యబాబు (24), అయిజ మండలం సంకాపురానికి చెందిన యువతితో వివాహం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. కాగా ఆరోజు రాత్రి వరుడు, వధువు ఒకే గదిలో నిద్రించేందుకు వెళ్లారు.
ఆ తర్వాత ఏమి జరిగిందో గానీ సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అత్తమామల వద్దకు వచ్చిన ఆమె.. ‘మీ కొడుకు అగుపిస్తలేడు..’అని చెప్పింది. వారు ఇంటి పరిసరాలను పరిశీలించగా పక్కగదిలో సూర్యబాబు ఉరేసుకుని చనిపోయి కన్పించాడు. వెంటనే పుట్టినింటికి సమాచారం అందించిన పెళ్లికూతురు తమ వారు తీసుకొచ్చిన వాహనంలో స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఈ విషయమై సూర్యబాబు కుటుంబసభ్యులు శాంతినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ శ్రీహరి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యబాబు మృతదేహానికి అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. సాయంత్రం తనగలలో అతని అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment