నాగోలు: అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతి చెందిన ఘటన ఎల్‌బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, జర్పుల తండాకు చెందిన జర్పుల మంత్రు, మారెమ్మ దంపతుల కుమార్తె అమూల్య (22), కొత్తపేటలోని ఓ కాఫీ షాపులో పని చేసేది.
అక్కడ పని చేస్తున్న నాగర్‌కర్నూల్‌కు చెందిన కంతుల డేవిడ్(25)తో పరిచయమై మార్చి 24న సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకుని వనస్థలిపురంలో కొన్ని రోజులు ఉండి, గత 20 రోజుల క్రితం ఎల్‌బీనగర్‌లోని శివగంగాకాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. నాటి నుంచి అమూల్య పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది.
మూడ్రోజుల క్రితం హస్తినాపురంలో ఉండే తన అక్క ఇంటికి వెళ్లగా మెడలోని నల్లపూసలు గురించి కుటుంబ సభ్యులు అడిగినట్లు సమాచారం. అక్కడ నుంచి 17న హాస్టల్‌కు వెళ్తున్నానని చెప్పి తన భర్త వద్దకు వచ్చింది. అదే రోజు రాత్రి తల్లికి ఫోన్‌చేసి తాను కులాంతర వివాహం చేసుకున్నానని మీ వద్దనున్న తన బంగారు ఆభరణాలు, డబ్బులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం.
ఉదయం బాత్రూంలో అమూల్య చున్నీతో అనుమానాస్పద స్థితిలో ఉండటంతో గమనించిన డేవిడ్ కామినేని హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అమూల్య మృతి చెందిన సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు పెద్ద సంఖ్యలో ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
డేవిడ్ తన కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమూల్య మృతికి డేవిడ్ కారణమంటూ అతడిని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ రాములు ఎల్‌బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నాడు. పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ.. అమూల్య మృతికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి స్పందించి అమూల్య కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment