నగరంలో సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఓ సంస్థ కాంబోడియాకు చెందిన కంపెనీ చేతిలో మోసపోయింది. అక్కడి భారత రాయబార కార్యాలయం ఆరా తీయడంతో కొంత ఉపశమనం లభించింది. మిగిలిన సొమ్ము పంపకపోవడంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో సంస్థ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరికి చెందిన నోవీస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి చైనా నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకుంటుంది. అక్కడి సోలార్ పీవీ ప్యానల్స్ లిమిటెడ్ సంస్థ నుంచి కొన్నేళ్లుగా ముడిసరుకు ఖరీదు చేస్తోంది. సదరు కంపెనీ ప్రతినిధిగా చెప్పుకున్న ఓ మహిళ కొన్నాళ్ల క్రితం నోవీస్ సంస్థ నిర్వాహకులకు ఆన్‌లైన్‌లో పరిచయమైంది. తమకు కాంబోడియాలోనూ ఓ బ్రాంచ్ ఉందని, అక్కడ నుంచి ముడిసరుకు ఖరీదు చేస్తే చైనా కంటే తక్కువ ధరకు అందిస్తామని నమ్మబలికింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ మెయిల్ చేసింది. నోవీస్ సంస్థ రెండు.. మూడు దఫాలు అక్కడ నుంచే సరుకు తీసుకుంది.
ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ముడిసరుకు కోసం నగర సంస్థ కాంబోడియాలోని సోలార్ పీవీ ప్యానల్స్ లిమిటెడ్‌కు 1.46 లక్షల డాలర్లు (రూ. 1,06,66,424) చెల్లించింది. ఈ మొత్తం అందుకుని నెలలు గడుస్తున్నా సరుకు రాకపోవడంతో పాటు ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు.ఈ విషయాన్ని నోవీస్ సంస్థ కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి ఆధారాలు సమర్పించింది. దీనిపై రాయబార కార్యాలయ అధికారులు ఆరా తీశారు. భయపడిన సదరు సంస్థ నోవీస్ సంస్థకు 50 వేల డాలర్లు (రూ. 36,52,885) తిరిగి చెల్లించింది. మిగిలిన మొత్తంపై ఎన్నిసార్లు ప్రశ్నించినా వారి నుంచి స్పందన లేదు. నోవీస్ సంస్థ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది.
చదవండి: ద్విచక్ర వాహనంపై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు
ఒక్క పెగ్గే కదా అంటూ తాగేస్తున్నారా... అది కూడా ప్రాణాంతకమే!
Comments
Please login to add a commentAdd a comment