
డోర్నకల్: ఉద్యోగం రావడంలేదనే మనోవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారు ఎర్రమట్టితండాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. డోర్నకల్ సీఐ బి.ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రమట్టితండాకు చెందిన భూక్యా అనిల్ అలియాస్ విజయ్(23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
ఇప్పటికే కొన్ని పోటీపరీక్షలకు హాజరైన అనిల్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులకుతోడు ఉద్యోగం రావడం లేదన్న మనోవేదనలో ఉన్న అనిల్ శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మరునాడు ఉదయం కుటుంబసభ్యులు గమనించి చుట్టుపక్కల వెతకగా తండా సమీపంలోని ఓ వ్యవసాయబావిలో అనిల్ మృతదేహం లభ్యమైంది.
మృతదేహం నుంచి పురుగుమందు వాసన రావడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. ఉద్యోగం రాలేదనే బాధతోనే అనిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అనిల్ తండ్రి జయరాజ్ 20 ఏళ్ల క్రితమే అదృశ్యంకాగా, తల్లి, సోదరుడు ఉన్నారు. తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనిల్ ఆత్మహత్యకు ముందు రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ వాట్సాప్‌లో చెక్కర్లు కొట్టింది. ఉద్యోగం రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో అనిల్ పేర్కొన్నాడు. కాగా, లేఖ విషయం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు.