బెట్టింగ్స్‌ @ సైట్స్‌! | Online Game Betting Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

బెట్టింగ్స్‌ @ సైట్స్‌!

Published Thu, Jul 30 2020 9:48 AM | Last Updated on Thu, Jul 30 2020 9:48 AM

Online Game Betting Gang Arrest in Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

సాక్షి, సిటీబ్యూరో: రెండు వెబ్‌సైట్స్‌కు డిజైన్‌ చేసి, సబ్‌–ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, ఆన్‌లైన్‌లో బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. సూత్రధారి పరారీలో ఉండగా మిగిలిన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు. వారి నుంచి రూ.3.15 లక్షల నగదు, సెల్‌ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరేడ్‌మెట్, ఆర్కేపురం ప్రాంతానికి చెందిన చేతన్‌ దీపక్‌ భోగాని ఆన్‌లైన్‌లో బెట్టింగ్స్‌ నిర్వహించడానికి కొత్త విధానాన్ని ఆలోచించాడు.

గుజరాత్‌కు చెందిన ఓడెవలపర్‌ సాయంతో (www.rkexch.com , www.fordexch.com) పేర్లతో రెండు సైట్స్‌ అభివృద్ధి చేశాడు. వీటిని ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లతో పాటు కంప్యూటర్‌లోనూ ఓపెన్‌ చేసే అవకాశం ఉంది. తన దందాలో పందాలు కాసే వారు (పంటర్లు) కీలకం కావడంతో  అలాంటి వారిని గుర్తిస్తూ తనకు సహకరించడానికి బోయిన్‌పల్లికి చెందిన రాజేష్‌ కుమార్, సికింద్రాబాద్‌కు చెందిన నగేష్‌లను సబ్‌–ఏజెంట్లుగా నియమించుకున్నాడు.

వీరిద్దరూ తమ ప్రాంతాల్లో ఉన్న వారితో పాటు పరిచయస్తులైన యువతను ఆకర్షించేవారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్స్‌కు సిద్ధమైన వారి వివరాలు  దీపక్‌ను అందించేవాడు. అతను పంటర్లకు కొన్ని యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్స్‌ క్రియేట్‌ చేసి ఇచ్చేవాడు. ఆయా పంటర్లు వీటి సహకారంతో ఆ రెండు వెబ్‌సైట్స్‌లోకి ఎంటర్‌ అవుతారు. వీటి ద్వారా పోకర్, క్యాసినో, టీన్‌పట్టి, త్రీకార్డ్స్‌... ఇలా మొత్తం 15 రకాలైన ఆన్‌లైన్‌ గేమ్స్‌లోకి ఎంటర్‌ కావచ్చు. వాటి ఆధారంగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్స్‌ కాయవచ్చు. ఈ సైట్స్‌లోకి ఎంటర్‌ అయిన వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పంటర్లు ఆన్‌లైన్‌ బదిలీ, ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం ద్వారా నిర్వహించేలా దీపక్‌ డిజైన్‌ చేశాడు. ఈ లావాదేవీలపై సబ్‌–ఏజెంట్లకు కమీషన్‌ ఇస్తుండేవాడు. వీరి వద్ద 60 మంది పంటర్లు ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఈ దందా నిర్వహించేందుకుగాను వీరు బోయిన్‌పల్లిలోని రాజేష్‌కుమార్‌కు చెందిన ఫ్లాట్‌ వినియోగిస్తున్నారు. వీరి వ్యవహారంపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్‌ బుధవారం దాడి చేశారు. దీపక్‌ పరారుకాగా మిగిలిన ఇద్దరినీ పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను బోయిన్‌పల్లి పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement