రాంగోపాల్‌పేట్: ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పి మహిళలు, యువతులను నమ్మిస్తూ వారిని వ్యభిచారంలోకి దించుతున్న ముఠాలోని ముగ్గురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ సాయిఈశ్వర్‌గౌడ్ వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్‌కుమార్(28), వరంగల్‌కు చెందిన సురేష్(19), ఈస్ట్‌గోదావరికి చెందిన పవన్(20)తో పాటు అకిల్, తేజ, చరణ్ ముగ్గురు స్నేహితులు.
ఉపాధి కోసం నగరానికి వచ్చి బేగంపేటలో నివాసం ఉంటూ ఓ ఐస్‌క్రీం పార్లర్‌లో పనిచేసేవారు. జీతం సరిపోకపోవడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని సిద్ధమయ్యారు. సినిమాపై వ్యామోహంతో, ఉపాధి, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే ఒంటరి మహిళలు, యువతులకు ఈ ముఠా మాయమాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి వారితో వ్యభిచారం చేయిస్తుండేవారు. వారి ఫొటోలను తీసి కస్టమర్లకు పంపించి నచ్చితే వారి దగ్గరకు పంపించేవారు. ఢిల్లీకి చెందిన ఓ యువతి(19)కి తల్లిదండ్రులు చనిపోయారు. అక్కడ ఉద్యోగం లేక ఇంటి దగ్గరే ఉంటోంది. ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పరిచయమైంది.
హైదరాబాద్‌కు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పింది. దీంతో ఆమె కొద్ది రోజుల క్రితం నగరానికి వచ్చింది. యువతిని సతీష్‌కు పరిచయం చేసింది. ఆమెను వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ఒత్తిడి తీసుకుని రావడంతో ఈ నెల 11వ తేదీన తప్పించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పారిపోయి వచ్చింది. ఆ యువతిని వెంబడిస్తూ వచ్చిన గ్యాంగ్ సభ్యులు తమతో తీసుకుని వెళ్లేందుకు యత్నిస్తుండగా గోపాలపురం పెట్రోకార్ సిబ్బంది అక్కడికి వచ్చారు. పోలీసులను చూసి వారు పారిపోయారు. యువతి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు నిందితులపై పీటా యాక్ట్ కేసు నమోదు చేశారు. శుక్రవారం సతీష్, సురేష్, పవన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment