అనుమతి లేకుండానే ఫోన్‌ ట్యాపింగ్‌ | Phone tapping without permission | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుండానే ఫోన్‌ ట్యాపింగ్‌

Published Wed, Aug 21 2024 5:20 AM | Last Updated on Wed, Aug 21 2024 5:20 AM

Phone tapping without permission

అంతా కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు

విదేశాల్లో ఉన్న నిందితులను రప్పించేందుకు చర్యలు చేపడుతున్నాం... దర్యాప్తు నిష్పక్షపాతంగా 

సాగుతోంది.. బాధ్యులెవర్నీ వదిలిపెట్టం

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌

ఇందులో మాకెలాంటి సంబంధం లేదు: కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: ‘అనుమతి లేకుండానే రాజ్యాంగ పదవుల్లో ఉన్న అత్యున్నత స్థాయి అధికారులు, నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారు. ఇందుకు సంబంధించి విదేశాల్లో ఉన్న నిందితుల్ని కూడా రప్పించేందుకు చర్యలు చేపడుతున్నాం..’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అధీకృత అథారిటీ ద్వారా ఈ వివరాలు న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తున్నామని పేర్కొంది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి మంగళవారం కౌంటర్‌ దాఖలు చేసింది. 

మరోవైపు..ఫోన్‌ ట్యాపింగ్‌కు తాము కూడా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేంద్రం తన కౌంటర్‌లో పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ ట్యాప్‌ అయిందని, జడ్జీల ఫోన్లను ట్యాప్‌ చేసినట్టు ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారంటూ పత్రికల్లో వచ్చి కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే. 

ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ గాడి ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వం (రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా (కాంపిటెంట్‌ అథారిటీ)) తరఫున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేశారు. 

మా అనుమతి కోరలేదు: కేంద్రం
‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు. మా అనుమతి కోరలేదు. ఫోన్‌ ట్యాపింగ్‌కు రాష్ట్ర హోంశాఖ కూడా అనుమతి ఇవ్వొచ్చు. రాష్ట్రానికి కూడా ఆ అధికారం ఉంది. గరిష్టంగా 60 రోజుల వరకు అనుమతించాలి. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన, ప్రమేయం లేదు..’ అని కేంద్రం పేర్కొంది. 

చిరునామాలూ సేకరించారు: రాష్ట్ర ప్రభుత్వం
‘ప్రణీత్‌కుమార్‌ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పలువురితో కుమ్మక్కై పదేళ్లుగా సేకరించిన అనధికారిక సమాచారమంతా తన వ్యక్తిగత పెన్‌డ్రైవ్‌ల్లో, హార్డ్‌ డిస్క్‌ల్లో నిక్షిప్తం చేశారు. ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేయడం కోసం సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి ఆఫీస్‌లోని కంప్యూటర్లతో పాటు హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించారు. ప్రభాకర్‌రావు(ఏ–1), శ్రవణ్‌కుమార్‌ (ఏ–6) పరారీలో ఉన్నారు. 

విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావును రెడ్‌ కార్నర్‌ నోటీసులపై రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రణీత్‌కుమార్‌ (ఏ–2), భుజంగరావు (ఏ–3), తిరుపతన్న (ఏ–4), రాధాకిషన్‌రావు (ఏ–5)లతో కలసి వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని విచారణలో వెల్లడైంది. ప్రణీత్‌కుమార్‌ నేతృత్వంలో స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ)ను ఏర్పాటు చేసి కాల్‌ డేటా రికార్డు (సీడీఆర్‌), ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డేటా రికార్డ్‌ (ఐపీడీఆర్‌), లొకేషన్‌ సర్వీసెస్‌ ద్వారా అన్ని వర్గాల ప్రజల టెలిఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడమే కాకుండా వారి అడ్రస్‌లను కూడా సేకరించారు. 

అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేందుకు ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా నేరాలకు పాల్పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్‌ ఏడీజీపీ, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ ఐజీపీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఐజీపీలు ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతించవచ్చు. అయితే కాంపిటెంట్‌ అథారిటీకి 3 రోజుల్లో వివరాలు తెలియజేయాలి. ఆయన 7 రోజుల్లో దాన్ని ధ్రువీకరించాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు..’ అని రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

నిబంధనలు ఉల్లంఘించారు
‘ప్రభాకర్‌రావు పదవీ విరమణ పొందిన తర్వాత ఎస్‌ఐబీ చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌(ఇంటెలిజెన్స్‌)గా కీలక పోస్టు కట్టబెట్టారు. మూడేళ్ల వరకు ఆయన్ను ఆ పదవిలో కొనసాగనిచ్చారు. టెలికమ్‌ సంస్థలకు లేఖ రాసిన ప్రభుత్వం.. ప్రభాకర్‌రావు అడిగిన ఏ సమాచారమైనా ఇవ్వాలని చెప్పింది. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం నిబంధనలు ఇమిడి ఉన్నందున, అప్పటి హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నాకు  అధికారం ఉండటంతో నిందితులు రికార్డులను ఎలా తయారు చేశారు? కొందరిని ఎలా తప్పుదోవ పట్టించారు? అనే విషయాలను కోర్టుకు దృష్టికి తీసుకొస్తున్నా. 

2019 అక్టోబర్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు నేను హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేశా. హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ (కాంపిటెంట్‌ అథారిటీ) అనుమతి లేకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం చట్టవిరుద్ధం. హోం శాఖ చట్టాలు, నిబంధనలు, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్లపై నాకు పూర్తి అవగాహన ఉంది. 

ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ రూల్స్‌ 419ఏ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలోని రూల్స్‌ను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రభావితం చేసే తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు. ఈ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతోంది. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టం..’ అని రవి గుప్తా తన కౌంటర్‌లో స్పష్టం చేశా>రు. కాగా ఈ కేసుపై తదుపరి విచారణను ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement