
కారు డోర్‌ను ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా ఎలా తీయాలో చూపుతున్న అరుణ్
బొమ్మనహళ్లి(బెంగళూరు): బీకాం పట్టభద్రుడు జైల్లో సహచరుడు, యూట్యూబ్ ద్వారా కార్ల దొంగతనాల్లో మెళకువలు తెలుసుకున్నాడు. కారు అలారం మోగకుండా పని ముగించేవాడు. ఖరీదైన కారు కనిపిస్తే మాయం చేసి అమ్ముకుని జల్సాలు చేసేవాడు. ఈ కార్ల దొంగ బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పోలీసుకు పట్టుబడ్డాడు. అతని నుంచి సుమారు రూ. 70 లక్షల విలువ చేసే 10 కార్లు, ఒక బైక్‌ను, చోరీకి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
వరుస ఫిర్యాదులు రావడంతో
ఆ దొంగ అరుణ్‌కుమార్ (32). ఇతడు పుట్టిపెరిగింది చిత్తూరు జిల్లాలోని పలమనేరు. బీకాం వరకు చదువుకుని నేరాల బాట పట్టాడు. ములబాగిలుకు వచ్చి అక్కడ అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో ఇటీవల పార్కింగ్ చేసి ఉన్న కార్లు చోరీ అవుతున్నట్లు యజమానులు ఫిర్యాదులు చేయసాగారు. దీంతో పోలీసులు ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ 5వ సెక్టర్‌లో ఉన్న టీచర్స్ కాలనీలో కారు చోరీ చేసి వేసుకెళ్తున్న దొంగ అరుణ్‌ను పట్టుకున్నారు.
ఎలక్ట్రానిక్ టూల్స్ సాయంతో
అతన్ని విచారించగా నేర చరిత్ర బయటపడింది. ఇతనిపైన దోపిడీ, హత్య కేసులు ఉండటంతో కొన్ని రోజులు మదనపల్లి సబ్ జైలులో ఉన్నాడు. అక్కడ జైల్లో పరిచయమైన కార్ల దొంగ రాకేష్ ద్వారా కార్లను సులభంగా ఎలా ఎత్తుకెళ్లవచ్చో తెలుసుకున్నాడు. అలాగే యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడు. కొన్ని ఎలక్ట్రానిక్ టూల్స్ సహాయంతో కారు అలారం మోగకుండా లాక్ తీసేవాడు. ఆ కార్లను తమిళనాడులోని తిరుచ్చి, తిరువన్నామలై, వేలూరు, తిరుపత్తూరు తదితర ప్రాంతాల్లో అమ్మేవాడు. ఆగ్నేయ డీసీపీ సి.కే.బాబు, ఏసీపీ సుధీర్, ఎస్‌ఐ మునిరెడ్డి ఈ కేసును విచారించారు.
చదవండి: వాట్సప్‌లో పరిచయం ఆపై చనువు.. అప్పటి నుంచి అసలు కథ మొదలైంది!
Comments
Please login to add a commentAdd a comment