కీలక దశకు దర్యాప్తు  | Police investigation into Amalapuram incident case at crucial stage | Sakshi
Sakshi News home page

కీలక దశకు దర్యాప్తు 

Published Tue, May 31 2022 4:01 AM | Last Updated on Tue, May 31 2022 4:01 AM

Police investigation into Amalapuram incident case at crucial stage - Sakshi

సాక్షి, అమరావతి: అమలాపురం అల్లర్ల కేసులో పోలీసుల దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. విధ్వంసానికి సంబంధించిన కుట్ర రచన, అమలు చేసిన విధానంపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సమాజంలో వర్గవైషమ్యాలను రెచ్చగొట్టేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దాడుల్లో పాల్గొన్న అందర్నీ గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. సుమారు 300 మందిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారిలో ఇప్పటికే 62 మందిని అరెస్టు చేశారు.

మరో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. వారిలో పదిమందిని అరెస్టుచేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి ఆచూకీని కూడా పోలీసు బృందాలు గుర్తిస్తున్నాయి. దీంతో వచ్చే వారంలో మరింతమంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వారిలో పలువురిపై రౌడీషీట్లు తెరవాలని పోలీసులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం 52 మందిపై రౌడీషీట్లు ఎత్తేసిన విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వారిలో కొందరు ఇటీవల అమలాపురంలో జరిగిన విధ్వంసంలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. అప్పట్లో ఏకపక్షంగా అంతమందిపై ఒకేసారి రౌడీషీట్లు ఎత్తివేయడం శాంతిభద్రతల కోణంలో సరైన చర్యకాదని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

అమలాపురం అల్లర్లలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారి అరెస్టుల ప్రక్రియ పూర్తిచేసిన తరువాత ఈ దాడుల వెనుక కుట్రదారులపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరు సూత్రధారులను గుర్తించిన పోలీసులు వారు ఎవరి ప్రోత్సాహంతో, ఏ ప్రయోజనాల కోసం ఈ కుట్ర పన్నారన్న అంశాలను కొలిక్కి తేవాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే వారి కాల్‌డేటాలు, వాట్సాప్‌ సందేశాలు మొదలైనవి విశ్లేషిస్తున్నారు.  

పటిష్ట బందోబస్తు 
కోనసీమలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. అమలాపురంతోసహా జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సున్నితమైనవిగా గుర్తించిన గ్రామాల్లో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. మళ్లీ ఉద్రిక్తతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గ్రామాల్లోకి అనుమానితుల కదలికలు, రాకపోకలపై పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామాల్లో అన్నివర్గాల పెద్దలతో మాట్లాడుతూ సామరస్య పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టారు.

ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా కట్టడి చేస్తున్నారు. వినతిపత్రాల సమర్పణ కోసం కలెక్టరేట్‌లకుగానీ, తహశీల్దార్‌ కార్యాలయాలకుగానీ అనుమతించడం లేదు. ఎలాంటి వినతిపత్రాలనైనా సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో సమర్పించమని అధికార యంత్రాంగం ఇప్పటికే సూచించింది. ఇంటరెŠన్‌ట్‌ సేవల నిలుపుదలను కొనసాగిస్తున్నారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement