
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో లాకప్ డెత్ ఘటనపై భీమడోలు సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ వీరభద్రరావుపై వేటు పడింది. వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ గురువారం ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఉత్తర్వులిచ్చారు. తమ కుమారుడిని పోలీసులే లాకప్ డెత్ చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. అధికారుల నివేదిక ఆధారంగా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్టు డీఐజీ చెప్పారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.