సాక్షి, హైదరాబాద్: మన్నెగూడ వైద్య విద్యార్థిని వైశాలి అపహరణ కేసులో ప్రధాన నిందితుడు కె.నవీన్‌రెడ్డి.. వైశాలితో పెళ్లి కట్టుకథేనని పోలీసులు తేల్చారు. అరెస్టుకు ముందు నవీన్ గోవాలో పలు సెల్ఫీ వీడియోలు తీసి తనపై తప్పుడు ప్రకటనలు చేశాడని వైశాలి ఆదిభట్ల పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పలు టీవీ, యూట్యూబ్ చానళ్లలో వీటిని ప్రచారం చేయడంతో సమాజంలో తన, కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగిందని పేర్కొన్నారు.
కిడ్నాప్ కేసు నుంచి తప్పించుకోవడానికి, సానుభూతి పొందేందుకు నేరపూరిత ఉద్దేశంతో నవీన్ ఈ దుష్చర్యకు ఒడిగట్టాడని ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి, విచారించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైశాలితో ప్రైవేట్ ప్రదేశాల్లో సన్నిహితంగా గడిపామని సెల్ఫీ వీడియోలు చిత్రీకరించిన నవీన్.. వాటిని తన సోదరులు నందీప్‌రెడ్డి, వంశీ భరత్ రెడ్డి అలియాస్ చింటులకు పెన్ డ్రైవ్ ద్వారా పంపించాడని తెలిపారు.
వీటిని నందీప్ తన కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, 9010272378 వాట్సాప్ నంబర్ ద్వారా పలు ప్రసార మాధ్యమాలకు, యూట్యూబ్ చానళ్లకు పంపించాడని పేర్కొన్నారు. శుక్రవారం నందీప్, వంశీ భరత్‌ను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి సీపీయూ, మానిటర్, పెన్ డ్రైవ్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment