కందుకూరు రూరల్: మానసిక దివ్యాంగురాలైన కుమార్తెను 27 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేశారు. భర్త చెడు వ్యసనాలకు బానిసైనా కూలీనాలి చేసుకొని కుమార్తెతో జీవనం సాగిస్తోందా తల్లి. భార్యపై అనుమానానికి తోడు మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆ భర్త మృగాడిగా మారాడు. 30 ఏళ్లు కలిసి జీవించిన భార్యను, మానసిక దివ్యాంగురాలైన కుమార్తెను మానవత్వం మరిచి పెట్రోలు పోసి తగులబెట్టాడు. చికిత్స పొందుతూ కుమార్తె ప్రాణాలు వదలగా, భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరెడ్డికి అదే గ్రామానికి చెందిన సుశీలతో 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుమార్తె ప్రియాంక (27) మానసిక దివ్యాంగురాలు. శ్రీనివాసులరెడ్డి బేల్దారి పనులు చేస్తుంటాడు. సుశీల గ్రామంలో కూలి పనులకు వెళ్తుంటుంది. బిడ్డ పుట్టిన కొంత కాలం నుంచి భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతుండేవి. భార్యపై అనుమానం కూడా తలెత్తింది. గొడవల కారణంగా శ్రీనివాసరెడ్డి కొన్నాళ్లు భార్య, కూతురిని వదిలి హైదరాబాద్, బెంగళూరు వెళ్లి బేల్దారి పనులు చేసుకుంటుండేవాడు. తిరిగి వచ్చినప్పుడుల్లా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఘర్షణలకు దిగేవాడు.
ఈ నేపథ్యంలో భార్య, భర్తల మధ్య గొడవలు పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఇలా తాగుడుకు అలవాటు పడిన శ్రీనివాసరెడ్డి డబ్బుల కోసం, భార్యపై అనుమానంతో భార్యను, కూతురిని ఇంట్లో పెట్టి తలుపువేసి వెళ్తుంటాడు. ఈ విధంగానే శనివారం కూడా చేశాడు. తిరిగి రాత్రి భార్యతో గొడవపడి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లుంగీతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వారించి చుట్టు పక్కల వారు సర్దిచెప్పారు. ఈ గొడవలు రోజు ఉండేవేనని తల్లీ కూతుళ్లు ఇంటి ముందు దోమతెర వేసుకొని నిద్రిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి నిద్రపోయేందుకు మిద్దె మీదకు వెళ్లాడు.
అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆదివారం తెల్లవారు జామున మిద్దెమీద నుంచి తల్లీ కూతుళ్లపై పోశాడు. నిద్రలో ఉన్న తల్లి ఏదో కారుతుందని మేల్కొనే లోపు మంటలు వచ్చాయి. పెద్దగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆర్పారు. ఏం జరుగుతుందో తెలియని కూతురు శరీరం 80 శాతం కాలిపోయింది. తల్లి శరీరం 30 శాతం కాలింది. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి కుమార్తె ప్రియాంక మృతి చెందింది. కాలిన గాయాలతో తల్లి చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment