
రాజానగరం (తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్ కోవిడ్ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ సోకిన రిమాండ్ ఖైదీ ఒకరు పరారయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు చర్చిపేటకు చెందిన తురుగోపు సత్యనారాయణ అలియాస్ సత్తియ్య అలియాస్ సత్తిబాబు అలియాస్ మురళి (40) గృహహింస, హత్యా యత్నం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
అతడికి కరోనా వైరస్ సోకడంతో గతనెల 30న జీఎస్‌ఎల్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న అతను శనివారం అర్ధరాత్రి బెడ్‌పై వేసిన దుప్పటితో పాటు తాను కప్పుకునే మరో దుప్పటిని తాడుగా ఉపయోగించుకుని ఆస్పత్రిలోని మూడో అంతస్తులో ఉన్న కిటికీల నుంచి కిందికి దిగి పరారయ్యాడు. దీనిపై అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సిరిపురం నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రాజానగరం సీఐ ఎంవీ సుభాష్ చెప్పారు.