సాక్షి, చాంద్రాయణగుట్ట: డాన్‌ను అంటూ బెదిరించినందుకే రౌడీషీటర్ ఫర్రూ హత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఆరుగురు నిందితులను రెయిన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాలు వెల్లడించారు. జవహర్‌నగర్ సైనిక్‌పురికి చెందిన మహ్మద్ పర్వేజ్ అలియాస్ ఫర్రూ డాన్ (26) రియల్ ఎస్టేట్ చేసేవాడు. పలు నేరాలకు పాల్పడటంతో ఇతనిపై జవహర్‌నగర్ పోలీసులు రౌడీషీట్ తెరవడంతో పాటు 2015లో పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు.
కాగా అతడికి యాకుత్‌పురా చోటాపూల్‌కు చెందిన షేక్ సులేమాన్‌తో పరిచయం ఉంది. ఈ క్రమంలో వారు ఇబ్రహీంపట్నంలోని గాలేబ్ షా దర్గా వద్ద పేకాట, సట్టా ఆడేవారు. ఈ నెల 8,9 తేదీల్లో ఫర్రూ, సులేమాన్, ఆమూదీ, సర్వర్, అక్బర్, ఆమేర్ పేకాట ఆడారు. ఈ క్రమంలో సులేమాన్ రూ.50 వేలు గెలిచాడు. అయితే ఫర్రూ ఆ డబ్బులను లాక్కొని...తాను గ్యాంగ్‌స్టర్‌నని, లోకల్‌గా తనను డాన్ అంటారని బెదిరించడంతో పాటు దుర్భాషలాడాడు. దీనిని అవమానంగా భావించిన సులేమాన్ ఫర్రూను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాగా యాకుత్‌పురా చంద్రానగర్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ ఫెరోజ్ అలియాస్ ఫిట్టల్ ఫెరోజ్(24) బంధువు సాజిద్ అలియాస్ చాచాను 2020లో కొందరు వ్యక్తులు హత్య చేశారు.
ఈ ఘటనలో ఫర్రూ హస్తం ఉందని అనుమానించిన ఫెరోజ్ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో సులేమాన్, ఫెరోజ్‌తో పాటు తన సోదరులు షేక్ ఇసా, షేక్ అవేజ్, స్నేహితులు సయ్యద్ జమీన్, సయ్యద్ సాదిక్‌తో కలిసి ఈ నెల 9న రాత్రి షేక్ ఇసా ఫర్రూ వద్దకు వెళ్లి ఇబ్రహీం పట్నంలో పేకాట ఆడుదామంటూ స్విప్ట్ కారులో ఎక్కించుకొని బయల్దేరారు. మధ్యలో సులేమాన్ ఫోన్ చేసి తాను కూడా వస్తానని చెప్పడంతో అతడి మాటలు నిజమేనని నమ్మిన ఫర్రూ ఇసా కారులో రాత్రి 9.30 గంటల రెయిన్‌బజార్‌కు చేరుకున్నాడు. పథకంలో భాగంగా ఫర్రూ కారు దిగగానే షేక్ ఫెరోజ్ అతని కళ్లల్లో కారం చల్లాడు. అతడు రోడ్డుపై పడిపోగానే సులేమాన్, ఫెరోజ్ కత్తులతో దాడి చేసి హత్య చేశారు. టాస్క్‌ఫోర్స్, రెయిన్‌బజార్ పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ సయ్యద్ రఫిక్, నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి, రెయిన్‌బజార్, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు పి.ఆంజనేయులు, ఎస్.రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రతీకారంతో మరో రౌడీషీటర్..
చాంద్రాయణగుట్ట: రౌడీషీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. డీసీపీ గజరావు భూపాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫలక్‌నుమా ముస్తఫానగర్‌కు చెందిన మహ్మద్ జాబెర్ (27) గత జూలై నెలలో కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మహ్మద్ షానూర్ ఘాజీ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తన సోదరుడిని హత్య చేసిన జాబెర్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని ఘాజీ సోదరుడు మహ్మద్ షానవాజ్ ఘాజీ నిర్ణయించుకున్నాడు. కాగా హత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న సమయంలో జాబెర్‌కు మహ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తితో గొడవ జరిగిందని....అతను కూడా జాబెర్‌పై కోపంతో ఉన్నట్లు షానవాజ్‌కు తెలిసింది.
దీంతో షాన్‌వాజ్ అతడిని సంప్రదించి హత్యకు పథకం పన్నాడు. తన స్నేహితులైన షాహిన్‌నగర్‌కు చెందిన సైఫ్ అలీ ఖాన్, కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్ సమీర్, సయ్యద్ హాశం, మహ్మద్ జుబేర్, మరో ఇద్దరు మైనర్లతో కలిసి హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. హత్య అనంతరం బెయిల్, ఇతర ఖర్చులన్నీ తానే భరిస్తానని వారిని ఒప్పించాడు. పథకంలో భాగంగా ఈ నెల 12న అన్సారీ రోడ్డులో జాబెర్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment