ప్రతీకాత్మక చిత్రం
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లంటూ నకిలీ టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఒక కేసులో వైకుంఠం–1లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణారావు, తిరుమల లడ్డూ కౌంటర్లో పనిచేస్తున్న అరుణ్‌రాజు, తిరుపతిలో ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న బాలాజీ, తిరుమల ప్రత్యేక ప్రవేశదర్శనం కౌంటర్లో పనిచేస్తున్న ఆపరేటర్ నరేంద్రలను, మరో కేసులో తిరుపతికి చెందిన దళారి చెంగారెడ్డి, గతంలో త్రిలోక్ ఏజెన్సీ కౌంటర్ బాయ్‌గా పనిచేసిన దేవేంద్రప్రసాద్, వెంకట్‌లను అరెస్టు చేసినట్లు తిరుమల వన్ టౌన్, టూటౌన్ సీఐలు జగన్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్ చెప్పారు. వారు తెలిపిన మేరకు.. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ముఠా సభ్యులు ఆదివారం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన జితేంద్రకుమార్ సోనీ, అతడి స్నేహితులకు రూ.300 టికెట్లు నకిలీవి మూడింటిని రూ.21 వేలకు అమ్మి దర్శనానికి పంపించారు.
కౌంటర్‌లో ఆపరేటర్ నరేంద్ర టికెట్లను స్కాన్ చేయకుండా పంపడాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ ఉద్యోగులు అతడిని పట్టుకుని విచారించి తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు జిల్లా పెద్దాపురానికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబంతో సహా శ్రీవారి దర్శనానికి వచ్చాడు. దళారి చెంగారెడ్డి ముఠా సభ్యులు రూ.300 టికెట్లు నకిలీవి ఒక్కొక్కటి రూ.3,300కు వారికి అమ్మి శ్రీవారి దర్శనానికి పంపారు.
దర్శనం కౌంటర్ వద్ద నకిలీ టికెట్లను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తుల నుంచి సమాచారం సేకరించి తిరుమల టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి.. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్స్ నుంచి మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. నకిలీ టికెట్లు విక్రయించే దళారుల గురించి తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment