వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి
సాక్షి, అమరావతి: అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించొద్దని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసు శాఖ 14 మంది నిందితులను గుర్తించడంతోపాటు ఏడుగురిని 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం. నిందితులకు అధికార వైఎస్సార్‌సీపీతో ఏమాత్రం సంబంధం లేదని, వారిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు విపక్ష టీడీపీ – జనసేన వేసిన ఎత్తుగడలు పారలేదు.
పరారీలో ప్రధాన నిందితుడు
ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై రౌడీమూకల దాడిని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దాడికి పాల్పడ్డవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసు శాఖ దాడి దృశ్యాల వీడియో ఫుటేజీని పరిశీలించి 14 మంది నిందితులను గుర్తించింది.
కావలి – తుమ్మలపెంట మార్గంలో రాష్ట్రం దాటేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు నిందితులను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బండి విల్సన్, పుట్టా శివకుమార్‌రెడ్డి, షేక్ ఖాజావలి, కుప్పాల వంశీ, షేక్ కలీమ్ చోటు, షేక్ ఇలియాజర్, షేక్ బాజీలను అరెస్ట్ చేసినట్టు ఆదివారం ప్రకటించారు. 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఏడుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌తోపాటు మిగిలినవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించి ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాతోపాటు అన్ని చోట్లా విస్తృతంగా గాలిస్తున్నారు.
గతంలోనే నేర చరిత్ర..
రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉంది. కావలి ప్రాంతంలో ఈ ముఠా ఎన్నో ఏళ్లుగా రౌడీయిజం, సెటిల్‌మెంట్లు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. అమాయకులను మోసగిస్తున్న నిందితులపై గతంలోనే పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచారు. బండి విల్సన్‌పై 14 కేసులు, శివకుమార్‌రెడ్డిపై 8 కేసులు ఉండటం గమనార్హం. మిగిలిన ఐదుగురిని వీరి అనుచరులుగా గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 143, 341, 332, 307, 323, 427 రెడ్‌విత్ 34 సీఐపీ సెక్షన్ల కింద కావలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
రాజకీయ రాద్ధాంతం
డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని అధికార వైఎస్సార్ సీపీతోపాటు అంతా ఖండించినా టీడీపీ – జనసేన రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడిన నిందితులతో అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేకున్నా లోకేశ్ సహా టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. 24 గంటల్లోనే వాస్తవాలు బహిర్గతం కావడంతో విపక్ష నేతలు తోక ముడిచారు.
ఆర్టీసీ యూనియన్ల హర్షం
ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించిన విధానం, ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం పట్ల ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ సంఘాలకు ఎండీ భరోసానిచ్చారు.
సుధీర్ ముఠా మోసాలపై ఫిర్యాదు చేయాలి
వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించాం. కావలికి చెందిన ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కుమారుడి నిశ్చితార్థం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లడంతో పరారయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తాం. రూ.1.5 కోట్ల విలువైన రెండు వాహనాలను జప్తు చేశాం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సుధీర్ ముఠా చేతిలో మోసపోయిన వారు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. – తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ, నెల్లూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment