మీడియాతో ఎస్పీ రిషాంత్‌రెడ్డి
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో మొత్తం చక్రం తిప్పింది టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ అని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. నారాయణ ఆదేశాలు, ప్రణాళికను ఆ విద్యా సంస్థ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి పక్కాగా అమలు చేశారని వెల్లడించారు.
ఈ వ్యవహారంలో టీడీపీ నేత నారాయణను హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అరెస్టు చేశామన్నారు. అక్కడ నుంచి తీసుకొచ్చి చిత్తూరులోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని వివరించారు. అలాగే తిరుపతి నారాయణ విద్యాసంస్థల డీన్ బాలగంగాధర్ (36)ను కూడా అరెస్టు చేశామని చెప్పారు. ఈ మేరకు చిత్తూరులో ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏమన్నారంటే..
నిందితులు నారాయణ డీన్ బాలగంగాధర్, వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి
ఫోన్‌తో ఫొటో.. వాట్సాప్ గ్రూపులో షేరింగ్..
ఏప్రిల్ 27న ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్‌రెడ్డి ‘చిత్తూరు టాకీస్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై చిత్తూరు డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం.
ఏప్రిల్ 29న తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్ పి.సురేష్, తిరుపతి ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆంగ్ల ఉపాధ్యాయుడు కె.సుధాకర్, తిరుపతి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆరిఫ్, డీన్ కె.మోహన్, గిరిధర్‌రెడ్డితోపాటు గంగాధర నెల్లూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌రెడ్డి, బి.సోమును అరెస్టు చేశాం.
వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మినహా మిగిలినవాళ్లు గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినవారే. మరికొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలతో కలిసి.. నిందితులు.. గిరిధర్‌రెడ్డి, సుధాకర్, సురేష్, పవన్‌కుమార్‌ను ఈ నెల 9న కస్టడీకి తీసుకుని విచారించాం. నారాయణ ఆదేశాలతోనే ఇదంతా చేసినట్లు వారు అంగీకరించారు. నారాయణ ఆదేశాలతో ఆ సంస్థ సిబ్బంది మరికొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు.
నారాయణలో ఓ మోస్తరు మార్కులు వచ్చే విద్యార్థికి జిల్లా, రాష్ట్ర స్థాయి మార్కులు తెప్పించడం, ఫెయిల్ అయ్యే విద్యార్థిని పాస్ చేయడం వీళ్ల లక్ష్యం. ఇందుకోసం నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌రెడ్డికి పలుమార్లు నగదు ఇచ్చాడు. పవన్ తన స్నేహితుడైన సోము అనే ఇన్విజిలేటర్ గదికి వెళ్లి ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి గిరిధర్‌రెడ్డికి వాట్సాప్‌లో పంపించాడు. దీన్ని గిరిధర్.. నారాయణ స్కూల్ డీన్ బాలగంగాధర్‌కు, మరికొందరికి వాట్సాప్‌లో పంపాడు.
నారాయణ హెడ్ ఆఫీసులో సమాధానాల రూపకల్పన
బాలగంగాధర్ దీన్ని నారాయణ హెడ్ ఆఫీస్‌కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. అక్కడ సమాధానాలను రూపొందించారు. అక్కడ నుంచి పరీక్ష కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు, వాటర్ బాయ్స్, ఆయాల ద్వారా విద్యార్థులకు చేరతాయి. మంచి ఫలితాలు వస్తే నారాయణ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెరుగుతాయనే ఇలా ప్రణాళిక రచించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.. పలు కీలక సాంకేతిక ఆధారాలు సేకరించాం. నేరం రుజువైతే గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment