ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య
సాక్షి, ఆత్మకూరు: అదనపుకట్నం కోసం భార్యను వేధించారన్న కేసులో వాయిదాకు హాజరైన ఓ ఎస్సై కోర్టు ప్రాంగణంలో భార్యపై దాడికి పాల్పడిన ఘటన ఆత్మకూరు ఫ్యామిలీ కోర్టులో బుధవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. సంగం మండలానికి చెందిన కురకూటి లావణ్య ఇంజినీరింగ్ చదివింది. సమీప బంధువు అయిన చెంగా నాగార్జున ప్రేమిస్తున్నానంటూ ఆమెను వెంటపడ్డాడు. బంధువులతో మాట్లాడి 2017వ సంవత్సరం జొన్నవాడ ఆలయంలో వారు వివాహం చేసుకున్నారు.
ఆ సమయంలో రూ.10 లక్షల నగదు కట్నంగా ఇచ్చినట్లుగా లావణ్య కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏడాది పాటు వారి కాపురం సజావుగా సాగింది. కొంతకాలానికి నాగార్జునకు ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. అనంతపురం ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందాడు. కాగా లావణ్యను దూరంగా పెట్టాడు. కొన్నినెలల అనంతరం అతడికి గుంటూరు జిల్లా అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగ్ వచ్చింది. అప్పుడు లావణ్య వెళ్లి కలవడంతో తనకు ఎస్సైగా ఉద్యోగం వచ్చిందని, అదనంగా రూ.50 లక్షలు కట్నం ఇవ్వాలని నాగార్జున డిమాండ్ చేశాడు. దీనిపై స్టేషన్‌లోనే వారి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
చదవండి: (పెళ్లైనప్పటి నుంచే పద్మజ అంటే చిన్నచూపు.. అనుమానంతో)
ఇదేక్రమంలో సంగం గ్రామానికి చెందిన మరో యువతితో నాగార్జున ప్రేమాయణం సాగిస్తున్నాడని లావణ్య గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకెళ్లింది. విచారణ చేసిన ఎస్పీ రెండునెలల క్రితం నాగార్జునను వీఆర్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆత్మకూరు ఫ్యామిలీ కోర్టులో విచారణకు హాజరైన నాగార్జున, అతని తండ్రి నాగేశ్వరరావు అక్కడి ఆవరణలోనే లావణ్యతోపాటు ఆమె తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు.
సమీపంలోని లాయర్లు వచ్చి వారిని వారించారు. వెంటనే న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తడంతో కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. గాయపడిన లావణ్యను పోలీసులు ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇప్పటికే రెండుమార్లు నాగార్జున తనను చంపేస్తానని చెప్పి బెదిరించాడని, తనకు న్యాయం చేయాలని లావణ్య కోరింది. కేసు నమోదు చేసినట్లుగా ఆత్మకూరు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment