
సాక్షి, న్యూఢిల్లీ: తన క్లయింట్ సుకేశ్ చంద్రశేఖర్ లేవనెత్తిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరు మీడియా, రాజకీయ పార్టీలపై బ్లేమ్ గేమ్ (పరిష్కారం కోసం చూడకుండా నిందలు వేయడం)లా ఉందని న్యాయవాది అనంత్ మాలిక్ విమర్శించారు. సుకేశ్ ఎవరో తనకు తెలియదంటూ కవిత విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేర కు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ‘సుకేశ్ చంద్రశేఖర్ లేవనెత్తిన అంశాలపై కవిత జారీ చేసిన ప్రకటన చిన్నపిల్లల వ్యవహారంలా ఉంది.
సుకేశ్ తన ఆరోపణలను అఫిడవిట్ రూపంలో ఇచ్చారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65బీ కింద ధ్రువపత్రం కూడా ఇచ్చారు. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించకుండా అస్పష్టమైన ఆరోపణలతో దర్యాప్తు నుంచి తప్పించుకోవాలని యత్నించడం నీటిని ఒడిసి పట్టుకొని ఉంచాలనుకోవడమే. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడెవరైనా విచారణ స్వాగతించేవారు.
కవిత స్పందన చూస్తుంటే దాగుడుమూతలు ఆడడంలో ఉన్న నైపుణ్యం కనిపిస్తోంది. ఈ అంశం ప్రత్యేక దర్యాప్తు సంస్థల ప్రత్యేక పరిశోధనకు సంబంధించినదే కానీ, ప్రజల్లో ప్రజాదరణ కోసం పోటీ కాదు. అయితే నా క్లయింట్ కూడా ఈ వారంలోనే పూర్తిస్థాయిలో స్పందిస్తారు’ అని అనంత్ తెలిపారు.