చిన్నారి మృత దేహం లభించిన ప్రాంతం
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ముఖం కమిలి పోయి ఎవరో తీవ్రంగా కొట్టినట్లు ఉండగా, కుడి చేయి విరిచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందరూ దీపావళి వేడుకల్లో ఉండగా గురువారం ఉదయం సుమారు 9:45 ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పాప మృతదేహాన్ని పంజగుట్ట ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు పడేశారు. పాప గులాబీ రంగు ప్యాంట్, బూడిద రంగు టీషర్ట్ వేసుకుని ఉండగా, ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టారు. పాపను గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
పోలీసు బృందాల దర్యాప్తు: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా.. తాము ఉదయం 9:15 గంటల ప్రాంతంలో అక్కడే శుభ్రం చేశామని ఆ సమయంలో అక్కడ మృతదేహం కనిపించలేదని చెప్పారు. 9:30 నుంచి 9:45 ప్రాంతంలో అక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులకు కేసు మిస్టరీగా మారింది. డాగ్ టీం, క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించాయి. బాలిక ముఖంపై ఎవరో కొట్టినట్లు కమిలిపోయి ఉండటం, కుడిచేయి విరిగి ఉండటంతో ఎవరో హత్యచేసి ఉంటారని భావిస్తు న్నారు.
గురువారం అమావాస్య ఉండటంతో క్షుధ్రపూజలు ఏమైనా చేశారా అనే దానితో పాటు ఇతర కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్, క్రైమ్ టీం, పంజగుట్ట పోలీసులు బృందాలుగా విడిపోయి అన్ని మార్గాల్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ అంతా బాలిక పోస్టర్లు, సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫొటోలు పెట్టి ఎవరికైనా తెలిస్తే సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. శుక్రవారం సాయంత్రం గాంధీలో ఇద్దరు ఫ్రొఫెసర్ల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కిడ్నీ పైభాగం, ఊపిరితిత్తుల కింది ప్రాంతంలో బలమైన గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
చదవండి: అన్నయ్య చెప్పినా వినకుండా.. చివరికి ఏం జరిగిందంటే..
Comments
Please login to add a commentAdd a comment