
మడకశిర రూరల్: దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. భర్త ఉరి వేసుకున్న ప్రాంతంలోనే రక్తపు గాయాలతో భార్య మృతదేహం లభ్యం కావడంతో ఇరువైపులా కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. మడకశిర మండలం ఎగువ రామగిరి గ్రామానికి చెందిన చింతగుట్లప్ప, నింకమ్మ దంపతుల కుమారుడు వెంకటేష్ (42)కు 14 ఏళ్ల క్రితం కర్ణాటకలోని పావగడ తాలూకా ఈర్లగొంది గ్రామానికి చెందిన బొమ్మక్క కుమార్తె రాధమ్మ (35)తో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల వయసున్న కుమార్తె ఉంది. పరిగిలోని గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికురాలిగా రాధమ్మ పనిచేస్తోంది. మంగళవారం అర్ధరాత్రి గ్రామ శివారులోని రోడ్డు పక్కన చెట్టుకు వెంకటేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పక్కనే రాధమ్మ రక్తగాయాలతో విగతజీవిగా పడి ఉంది.
బుధవారం ఉదయం అటుగా వెళ్లిన వారు మృతదేహాలను గమనించి, సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. భార్యను హత్య చేసి, అనంతరం వెంకటేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ సురే‹Ùబాబు, ఎస్‌ఐ నాగేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. ద్విచక్రవాహనం, కట్టె, తాడు స్వా«దీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను వెంకటేష్ హతమార్చి ఉంటాడనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు.
పథకం ప్రకారమే.. : ఘటనపై రాధమ్మ తల్లి బొమ్మక్క మాట్లాడుతూ.. పథకం ప్రకారమే తన కుమార్తెను అల్లుడు హతమార్చాడని, అనంతరం పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది. మంగళవారం రాత్రి ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై కుమార్తెను గ్రామ శివారులోకి పిలుచుకెళ్లి, కట్టెతో కొట్టి హతమార్చినాడని బోరున విలపించింది. గ్రామంలో ఈ నెల 10న జాతర ఉందని, ఖర్చులకు డబ్బు కావాలంటే కొంత మొత్తాన్ని కూడా ఇచ్చినట్లు గుర్తు చేసింది. గతంలోనూ కుమార్తెను వేధిస్తుండడంతో పావగడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో స్టేషన్‌లో రాజీ చేశారని, అయినా అల్లుడిలో మార్పు రాలేదని పేర్కొంది. రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని కుమార్తెతో గొడవపడేవాడని, ఈ క్రమంలోనే భార్యను పథకం ప్రకారమే వెంకటేష్ హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment