స్వాధీనం చేసుకున్న మత్తు మాత్రలు
సాక్షి, చెన్నై: వాట్సాప్ ద్వారా మత్తు మందు విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముంబై నుంచి వీటిని తీసుకొచ్చిన క్రమంలో విచారణను వేగవంతం చేశారు. ఇటీవల చెన్నైలో గంజాయి విక్రయాలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. విక్రయదారులను అరెస్టు చేయడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు యువకులు వాట్సాప్ ద్వారా మత్తు మాత్రలు, ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఉత్తర చెన్నై పరిధిలోని కళాశాలల విద్యార్థులు వీటికి బానిసైనట్లు గుర్తించారు.
తనిఖీల్లో చిక్కారు
తండాయర్‌పేట ఇన్‌స్పెక్టర్ శంకర నారాయణన్ నేతృత్వంలోని బృందం గురువారం వాహన తనిఖీలు చేశారు. చాకలిపేట–తిరువొత్తియూరు మార్గంలోని త్యాగరాయ కళాశాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద 1,300 మత్తుమాత్రలు, 15 ఇంజెక్షన్లు, సిరంజీలు, స్టెరాయిడ్ వాటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తరమణి భారతీనగర్‌కు చెందిన సూర్య (23), కీల్ కట్టలై ఈశ్వరన్‌నగర్‌కు చెందిన రాజ్‌కుమార్(28)ని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా తమకు వచ్చే సమాచారం మేరకు వీటిని సరఫరా చేస్తుంటామని పోలీసులకు వివరించారు. మత్తుమాత్రులు ముంబై నుంచి దిగుమతి చేసి ఉండడంతో ఈ ఇద్దరి వెనుక ముఠా ఉంటుందన్న అనుమానాలు నెలకొన్నాయి. వారి సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment