బనగానపల్లె/అవుకు (కర్నూలు): అధికారం కోల్పోయినప్పటికీ కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు ఆగడం లేదు. బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం సంగపట్నం గ్రామ టీడీపీ నాయకుడు ఐవీ పక్కీరారెడ్డి దౌర్జన్యాలను తాళలేక గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇడమకంటి హుస్సేన్‌రెడ్డి (38), ఆయన భార్య ఆదిలక్ష్మి (35) గురువారం అర్ధరాత్రి ఇంట్లోని సీలింగ్ కడ్డీలకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుస్సేన్‌రెడ్డి తల్లి లక్ష్మీదేవి కూడా గ్రామస్తుల సమక్షంలోనే పురుగు మందు తాగింది. ఆమెను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
టీడీపీ నాయకుడు ఐవీ పక్కీరారెడ్డి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి దగ్గరి బంధువు కావడం గమనార్హం. మృతుల బంధువు ఎం.వెంకటేశ్వరరెడ్డి, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టీడీపీ హయాంలో ఇడమకంటి హుస్సేన్‌రెడ్డి స్థలంలో ఐవీ పక్కీరారెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. అప్పట్లో స్థలానికి డబ్బు చెల్లిస్తామని ఇవ్వలేదు. డబ్బు ఇవ్వనందుకు నిరసనగా హుస్సేన్‌రెడ్డి 10రోజుల పాటు వాటర్ ప్లాంట్‌ను బంద్ చేశాడు. దీనికి ఆగ్రహించిన పక్కీరారెడ్డి తన అనుచరుడు బోయ రాముడును హుస్సేన్‌రెడ్డిపై గొడవకు పంపించి, పోలీసులకు ఫిర్యాదు చేయించాడు.
పిలిపించి..దుర్భాషలాడి...
ఈ క్రమంలో ఈ నెల 16న పక్కీరారెడ్డి తన అనుచరులను పంపి హుస్సేన్‌రెడ్డిని తన వద్దకు పిలిపించుకున్నాడు. వాటర్ ప్లాంట్ స్థలం సంగతి మర్చిపోవాలని, తన గురించి ఎక్కడైనా మాట్లాడితే ఊరొదిలి పోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. హుస్సేన్‌రెడ్డి కుమార్తెల కుటుంబాల్లో చిచ్చుపెట్టి.. వారి కాపురాలు కూలుస్తానని కూడా బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన హుస్సేన్‌రెడ్డి దంపతులు గురువారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకు, కోడలి మృతితో ఆవేదన చెందిన హుస్సేన్‌రెడ్డి తల్లి లక్ష్మీదేవి గ్రామస్తుల సమక్షంలోనే పురుగు మందు తాగింది. ఘటనా స్థలాన్ని డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, బనగానపల్లె సీఐ సురేష్ కుమార్‌రెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఐవీ పక్కీరారెడ్డి, ఐ.ఈశ్వరమ్మ, బోయ రాముడుపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతులిద్దరూ రామాపురంలోని బండల ఫ్యాక్టరీలో పాలిష్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment