ఘటనాస్థలం వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు
సాక్షి, గుంటూరు, రేపల్లె రూరల్, సాక్షి, అమరావతి : బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీ కుటుంబంపై మానవ మృగాలు దాడి చేశాయి. నాలుగు నెలల గర్భిణిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భార్యను కాపాడుకునేందుకు ఆ భర్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిందితులు పరారయ్యారు. గంటల వ్యవధిలోనే ఆ మృగాలని పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలిని వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన ఓ కుటుంబం తాపీ పని నిమిత్తం కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్లేందుకు శనివారం రాత్రి గుంటూరు నుంచి రేపల్లె రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కృష్ణా జిల్లాకు వెళ్లేందుకు బస్సులు, ఆటోలు లేకపోవటంతో తమ ముగ్గురు పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై నిద్రించారు.
సమయం అడిగి భర్తతో వివాదం.. ఆపై..
అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్లాట్‌ఫారంపైకి మద్యం మత్తులో వచ్చిన ముగ్గురు దుండగులు నిద్రిస్తున్న బాధితురాలి (25) భర్తను లేపి సమయం ఎంతైందని అడిగారు. తన దగ్గర వాచ్‌లేదని సమాధానం చెప్పగా, ఆ వ్యక్తి వద్ద ఉన్న రూ.750 లాక్కొని దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న భార్య తన భర్తను కొట్టవద్దని ప్రాధేయపడగా.. వారిలో ఇద్దరు ఆమెను ప్లాట్‌ఫారంపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు. తర్వాత మరో నిందితుడూ వారితో కలిశాడు. ముగ్గురూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఆర్‌పీఎఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. పలుమార్లు తలుపు కొట్టినా ఎవరూ స్పందించలేదు. వెంటనే స్టేషన్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న రిక్షా కార్మికులను ఆశ్రయించాడు.
బాధితురాలి కుటుంబసభ్యుడికి రూ.50 వేల సాయం అందజేస్తున్న మోపిదేవి రాజీవ్, మంత్రి మేరుగ
తాము సహాయం చేయలేమని, కొంత దూరంలో పోలీసు స్టేషన్ ఉందని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్‌కు పరుగు పరుగున చేరుకుని విషయం చెప్పాడు. సర్కిల్ కార్యాలయ పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్ చేరుకునే లోపు జీపు సైరన్ విన్న దుండగులు పరారయ్యారు. లైంగిక దాడికి గురైన బాధితురాలిని తక్షణ వైద్య సేవల నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 4 నెలల గర్భవతి అని వైద్యాధికారులు చెప్పారు.
మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని, అమె కుటుంబ సభ్యులను ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, బాధితురాలి భర్త ఫిర్యాదుతో రేపల్లె సీఐ వి.సూర్యనారాయణ ఐపీసీ సెక్షన్లు 376(డీ), 394, 307 ఆర్/డబ్యూ 34తో కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎప్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో గంధం రవీందర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితులను గుర్తించారు.
గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్
రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై నిందితులవి రెండు జతల చెప్పులు పడివుండటంతో వాటిని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయగా, అవి కొంతదూరంలో నిందితులలో ఒకరు చొక్కా మార్చుకున్న చోటుకు వెళ్లాయి. అక్కడ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు రేపల్లె పట్టణంలోని 24వ వార్డుకు చెందిన పోలుబోయిన విజయ్‌కృష్ణ, పాలుచూరి నిఖిల్, మరో మైనరు (16) బాలుడిగా గుర్తించారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు వారిని అరెస్ట్ చేసినట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. మైనర్ బాలుడు ఇప్పటికే మూడు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్నాడన్నారు. వీలైనంత త్వరగా చార్జిషీట్ వేసి, శిక్షపడేలా చూస్తామన్నారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరు పరిచారు. కాగా, రైల్వే పోలీసులు స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. రైల్వే అధికారులెవరూ స్పందించలేదు. ఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ అజయ్‌ప్రసాద్ విలేకర్లతో మాట్లాడేందుకు నిరాకరించారు.
దోషులను కఠినంగా శిక్షిస్తాం
ఒంగోలు అర్బన్: మహిళలకు సంబంధించిన ఘటనలు సున్నితమైనవి కాబట్టి వాటిని ఎవరైనా సరే సున్నితంగానే చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. రేపల్లె ఘటనకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాధితురాలిని ఆదివారం ఆమె ఒంగోలు జీజీహెచ్‌లో పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితులు ప్రకాశం జిల్లా వాసులు కావడంతో మెరుగైన వైద్యం, రిహాబిలిటేషన్ కోసంఒంగోలు జీజీహెచ్‌కు తరలించామన్నారు.
బాధితురాలి కుటుంబసభ్యుడికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల చెక్కుని అందజేస్తున్న మంత్రి విడదల రజని
మహిళా కమిషన్ సీరియస్
అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఘటన సమాచారం తెలియగానే చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలన్నారు. రైల్వేస్టేషన్‌లలో మహిళల భద్రత, రక్షణ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రైల్వే శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించి పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చారన్నారు. అత్యాచార నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.
ఆదివారం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, మోపిదేవి రాజీవ్, మోపిదేవి హరనాధబాబులతో కలసి బాధితురాలిని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ.. సమాచారం తెలియగానే సీఎం జగన్ తమను అప్రమత్తం చేశారన్నారు. తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు చెప్పారు. ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు తనయుడు రాజీవ్.. బాధితులకు తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. కాగా, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్‌పీఎస్ నాయకులు రేపల్లె ప్రభుత్వ వైద్యశాల వద్ద, ఒంగోలు జీజీహెచ్ వద్ద హడావుడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment