ఓబులేసు (ఫైల్), సుబ్బారెడ్డి (ఫైల్), డ్రైవర్ విజయ్‌కుమార్ (ఫైల్)
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: ఉదయాన్నే పొలం పనికి వచ్చి విరామ సమయంలో రోడ్డు వెంబడి కూర్చుని అన్నం తింటున్న రైతు, కూలీపై నుంచి టిప్పర్ లారీ దూసుకువెళ్లడంతో ఇద్దరూ మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ పల్టీ కొట్టడంతో డ్రైవర్ కూడా మరణించాడు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగనూరు గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. గొరిగనూరు గ్రామానికి చెందిన రైతు ఎనముల నాగసుబ్బారెడ్డి పొలంలో పని కోసం ఉదయం వ్యవసాయ కూలీలు వచ్చారు.
కొద్దిసేపు పనిచేసిన తర్వాత ఎనిమిది మంది తమ వెంట తెచ్చుకున్న సద్దిమూటలు విప్పి అన్నం తినడానికి రోడ్డు పక్కన కూర్చున్నారు. ఆరుగురు కూలీలు అన్నం తినేసి మళ్లీ పనిలోకి వెళ్లారు. పొలం యజమాని ఎనముల నాగసుబ్బారెడ్డి(67), ధర్మాపురం గ్రామానికి చెందిన ఎనగలూరు ఓబులేసు(55) అనే కూలీ అన్నం తింటుండగా... జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు వైపునకు వెళుతున్న టిప్పర్ వేగంగా వారి మీదుగా దూసుకువెళ్లింది. దీంతో వారి శరీరాలు ఛిద్రమయ్యాయి.
ఇద్దరూ ఘటనాస్థలంలోనే మరణించారు. ఎస్.ఉప్పలపాడు గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ విజయ్‌కుమార్(58) వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అది పల్టీలు కొట్టి పొలంలో పడిపోయింది. డ్రైవర్ కూడా సీటు కింద నలిగిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. మృతులు సుబ్బారెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు.. ఓబులేసుకు భార్య, ఇద్దరు పిల్లలు, డ్రైవర్ విజయ్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఘటనాస్థలాన్ని డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. డ్రైవర్ విజయ్‌కుమార్‌కు ఫిట్స్‌తోపాటు లోబీపీ ఉన్నట్లు తెలుసుకున్నారు. డ్రైవర్ నోట్లో నురగ రావడంతో ఫిట్స్ వచ్చినందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతిచెందిన ఓబులేసు, నాగసుబ్బారెడ్డి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు.
ధర్నాకు దిగిన బాధిత కుటుంబాలు
దేవగుడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి టిప్పర్‌ను మరొకరి వద్ద కొనుగోలు చేశాడు. టిప్పర్‌కు సంబంధించిన రికార్డులను తన పేరు మీద మార్చుకోకపోవడంతో పాటు ఇన్సూరెన్సు కూడా రెన్యూవల్ చేయించలేదు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌కు ఉన్న నంబర్ ప్లేట్‌ను తొలగించేశారు. దీంతో బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా సమీపంలోని ధర్మాపురం, గొరిగనూరు గ్రామాల మహిళలు స్వచ్ఛందంగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు. రెండున్నర గంటలపాటు జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వచ్చి బాధితులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా గొరిగనూరులో టిప్పర్ లారీ దూసుకెళ్లిన ఘటనలో ఓ రైతు, కూలీ మృతి చెందడం పట్ల సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment