బాలికపై సామూహిక అత్యాచారం
రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘటన
నిందితుల్లో ఆస్పత్రి మాజీ ఉద్యోగి
జోధ్‌పూర్: రాజస్తాన్‌లోని మహాత్మాగాంధీ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం చోటుచేసుకుంది. జోధ్‌పూర్ నగరంలోని ఈ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరు ఈ ఆస్పత్రిలో మాజీ ఉద్యోగి కావడం గమనార్హం. జోధ్‌పూర్ సిటీ(వెస్ట్) ఏసీపీ అనిల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం బాలికను ఇంట్లో అమ్మ బాగా కోప్పడింది. దీంతో అలిగిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి దగ్గర్లోని మహాత్మాగాంధీ ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది.
అక్కడ ఒంటరిగా తిరుగుతున్న బాలికతో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు మాటలు కలిపారు. తర్వాత బాలికను ఆస్పత్రి వెనుకభాగంలో ఆస్పత్రి బయోవ్యర్థాలను నిల్వఉంచిన డంపింగ్ యాడ్ వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు. అమ్మాయి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు బాగా వెతికి చివరకు సోమవారం సూరసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రి సమీపంలో బాలిక జాడ కనిపెట్టారు. అమ్మాయి దొరికిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
తల్లిదండ్రులు వచ్చాక ముందురోజు తాను ఎదుర్కొన్న భయానక ఘటనను తల్లిదండ్రులు, పోలీసులకు అమ్మాయి విడమరిచి చెప్పింది. దీంతో అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి నిందితుల జాడ కోసం వేట మొదలెట్టారు. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్‌చేసి ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం డంపింగ్‌యార్డ్‌లోని ఘటనాస్థలికి వెళ్లి ఫోరెన్సిక్ బృందం సాక్ష్యాధారాలను సేకరించిందని ఏసీపీ చెప్పారు.
‘‘ పోలీసులు ఆస్పత్రికి వచ్చారుగానీ అసలేం జరిగిందో మాకు చెప్పలేదు. మేం అంతర్గతంగా వివరాలు రాబట్టగా నిందితుల్లో ఒకడు మా ఆస్పత్రిలో గతంలో కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం చేశాడని తెల్సింది’’ అని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫతాసింగ్ భాటి చెప్పారు. రాత్రిళ్లు ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడా చీకటి ఉండొద్దు. లైట్లు బిగించండి. చీకటి ప్రాంతం కనిపించొద్దు’ అని సిబ్బందిని ఆయన ఆదేశించారు.
విమర్శలు ఎక్కుపెట్టిన విపక్షాలు
బీజేపీ హయాంలో రాష్ట్రంలో ఆటవికపాలన నడుస్తోందని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘‘ ఆటవిక ఏలుబడికి తాజా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. శాంతిభద్రతల అంశం అటు ప్రజా ప్రతినిధులకు, ఇటు పోలీసులకు ఏమాత్రం పట్టట్లేదు. దీంతో నేరస్తులకు భయం లేకుండా పోయింది.
ఒకప్పుడు నేరాలే జరగని జోధ్‌పూర్‌లో ఇప్పుడు బీజేపీ అస్తవ్యస్థపాలనతో నగరంలో అమ్మాయిలకు రక్షణ కరువైంది’’ అని కాంగ్రెస్ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అన్నారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు అనేవే లేవని రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్‌సింగ్ దోస్తారా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment