‘స్కిల్‌’ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితుల అరెస్టు | Two accused Arrested in APSSDC scam Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితుల అరెస్టు

Published Fri, Aug 26 2022 3:48 AM | Last Updated on Fri, Aug 26 2022 5:35 AM

Two accused Arrested in APSSDC scam Chandrababu Govt - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఇద్దరు కీలక నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ విపిన్‌ కుమార్‌ శర్మ, ఆయన భార్య నీలం శర్మను సీఐడీ అధికారులు అరెస్టు చేసి ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు. వారిని విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) న్యాయస్థానంలో బుధవారం రాత్రి హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామంటూ షెల్‌ కంపెనీల ముసుగులో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు రూ.241 కోట్ల నిధులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 

నకిలీ ఇన్వాయిస్‌లతో బురిడీ.. 
రూ.241 కోట్ల ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలకు అడ్డదారిలో నిధులు మళ్లించడంలో ఢిల్లీకి చెందిన విపిన్‌ శర్మ, నీలం శర్మ దంపతులు కీలకంగా వ్యవహరించారు. వారిద్దరూ ఢిల్లీలో ‘ఇన్‌ వెబ్‌ సర్వీసెస్‌’ అనే ఓ షెల్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలకు నిధులు చెల్లించింది. ఈ నిధులను సీమెన్స్, డిజైన్‌ టెక్‌.. వివిధ షెల్‌ కంపెనీల రూపంలో దారి మళ్లించాయి. ఈ క్రమంలో పూణేకు చెందిన స్కిల్లర్‌ అనే షెల్‌ కంపెనీ ద్వారా నకిలీ ఇన్వాయిస్‌లతో నిధులు కొల్లగొట్టిన విషయం గతంలోనే వెలుగు చూసింది.

ఆ నిధులను సింగపూర్‌లోని సంస్థలకు తరలించి.. అక్కడి నుంచి టీడీపీ ప్రభుత్వ పెద్దలకు చేర్చారు. అదే రీతిలో విపిన్‌ శర్మ, నీలం శర్మలకు చెందిన ఇన్‌ వెబ్‌ సర్వీసెస్‌ కంపెనీ నుంచి నకిలీ ఇన్వాయిస్‌లు తీసుకుని ఆ కంపెనీకి రూ.8.50 కోట్లు చెల్లించారు. అందులో తమ కమీషన్‌గా రూ.7.5 లక్షలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని మళ్లీ టీడీపీ ప్రభుత్వ పెద్దల ఖాతాల్లోకి ఆ కంపెనీ చేర్చింది. సీఐడీ దర్యాప్తులో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. దీంతో డిజైన్‌ టెక్‌ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని రూ.23 కోట్లను ఇటీవల సీఐడీ అధికారులు జప్తు చేశారు.  

చంద్రబాబు ఆదేశాలతో రూ.371 కోట్లు చెల్లింపు
ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకుండానే చంద్రబాబు ఆదేశాలతో అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ ప్రభుత్వం తరఫున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలుపుకుని రూ.371 కోట్ల నిధులను సీమెన్స్‌ ఇండియా, డిజైన్‌ టెక్‌లకు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కుంభకోణంలో ఏపీఎస్‌ఎస్‌డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ఇక ఏపీఎస్‌ఎస్‌డీసీ డిప్యూటీ సీఈవోగా ఐఏఎస్‌ అధికారి అపర్ణ ఉపాధ్యాయను నియమించారు.

ఈ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న సీమెన్స్‌ కంపెనీ కమిటీలో సభ్యుడైన జీవీఎస్‌ భాస్కర్‌ భార్య ఈమె. ఈ విధంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వడం గమనార్హం. కనీసం సీమెన్స్‌ ఇండియా, డిజైన్‌ టెక్‌ల నుంచి బ్యాంకు గ్యారంటీ కూడా తీసుకోలేదు. ఇందులో సీమెన్స్‌ కంపెనీ సరఫరా చేసిన రూ.56 కోట్ల సాఫ్ట్‌వేర్, మరికొన్నింటికి చెల్లింపులు చేసి కథ ముగించారు. మిగతా రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్‌లతో షెల్‌ కంపెనీలు, బినామీ కంపెనీ డిజైన్‌ టెక్‌ ఖాతాలోకి మళ్లించారు. అక్కడి నుంచి టీడీపీ పెద్దల ఖాతాల్లోకి రూ.241 కోట్లు చేరాయి.  

తనిఖీల్లో వెలుగుచూసిన నకిలీ ఇన్వాయిస్‌లు..
కాగా కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పూణేలో కొన్ని సంస్థలపై నిర్వహించిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్‌లు వెలుగు చూశాయి. అవి ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టుకు సంబంధించినవని గుర్తించి ఆ విషయాన్ని ఏపీ ఏసీబీ విభాగానికి తెలిపారు. కానీ అప్పటి టీడీపీ పెద్దలు ఈ విషయాన్ని కప్పిపుచ్చారు. పైగా ఏపీఎస్‌ఎస్‌డీసీలో కీలకమైన ఫైళ్లను మాయం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర జీఎస్టీ అధికారులు ఏసీబీ దృష్టికి తెచ్చిన విషయం బయటపడింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు చేపట్టింది.

టీడీపీ హయాంలో ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందం చేసుకున్న సుమన్‌ బోస్‌ అలియాస్‌ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ వ్యవహారాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్‌ కంపెనీ స్పష్టం చేస్తూ ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఓ లేఖ రాసింది. తాము అందించిన లైసెన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌కుగాను తమకు రూ.56 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించింది. అంతేగానీ వేల కోట్ల ప్రాజెక్టుకు తమ బాధ్యత లేదని సీమెన్స్‌ స్పష్టం చేసింది. దీంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టు పేరుతో టీడీపీ పెద్దలు అడ్డగోలుగా రూ.241 కోట్లు ప్రజాధనాన్ని దోపిడీ చేసినట్టు తేలింది.   

కుంభకోణం కథ ఇదీ..  
2014–15 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు రూ.3,556 కోట్లతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే కేవలం కాగితాలపైనే ఓ ప్రాజెక్టును చూపించి ప్రజాధనాన్ని టీడీపీ ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టారు. ఇందులో భాగంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును సీమెన్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఎండీ సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ కాన్విల్కర్‌ కలిశారు.

మొత్తం రూ.3,556 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలు 90 శాతం నిధులు పెట్టుబడి పెడతాయని ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు ఆ ప్రాజెక్టు వ్యయం రూ.3,556 కోట్లుగా ఎలా నిర్ధారించారని శాస్త్రీయంగా మదింపు చేయనే లేదు. అసలు సీమెన్స్‌ కంపెనీకి ఈ ఒప్పందం గురించే తెలియదు. భారత్‌లో గతంలో ఆ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్‌ బోస్‌ అలియాస్‌ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్‌ టెక్‌తో కలిసి కథ నడిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement