సాక్షి, చెన్నై: ప్రమాదంలో తనయుడు మరణించిన వేదనను తట్టుకోలేక డీఎంకేకు చెందిన ఓ నాయకుడు తన భార్యతో పాటూ మంగళవారం బలన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..కన్యాకుమారి జిల్లా కళియకావిళైకు చెందిన సహాయం(60) డీఎంకే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఆయన భార్య సుగంధి(55). ఈ దంపతుల ఏకైక కుమారుడు (21) ఏడాది క్రితం బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రెండు రోజుల క్రితం కుమారుడు సంవత్సరికం జరిగింది. తనయుడు మరణించినప్పటి నుంచి పార్టీ కార్యాక్రమాలకు సైతం సహాయం దూరంగా ఉంటూ వచ్చారు. సంవత్సరికం సంప్రదాయాల్ని ముగించినానంతరం భార్యాభర్తలు ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఇంట్లోనే మౌనంగా ఉంటూ వచ్చారు.
బంధువులు ఎంతగా ఓదార్చిన ఫలితం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం సహాయం ఇంటి తలుపులు తెరవక పోవడంతో పక్కింటి వారు బంధువులకు సమాచారం అందించారు. వారు పోలీసుల సాయంతో ఆ ఇంటి తలుపులు పగుల కొట్టి చూడగా , దంపతులు ఇద్దరు ఉరికి వేలాడుతూ కనిపించారు. ఇద్దరి మృత దేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం కన్యాకుమారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనయుడి మరణంతో మనో వేదనతో ఉన్న ఈ దంపతులు, అతడికి సంవత్సరంలో చేయాల్సిన సంప్రదాయాల్ని ముగించినానంతరం నీ వెంటే..కన్నా అంటూ బలన్మరణానికి పాల్పడడం స్థానికులను శోకంలో ముంచింది.
చదవండి: చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుల దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment