సాక్షి, గుంటూరు: బావతో వివాహేతర సంబంధం పెట్టుకుని బావతో కలసి భర్తను హత్యచేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవ విలువలను మంటగలిపే ఈ ఘటన మంగళగిరి మండలం, నవులూరు గ్రామం, ఉడా కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గత నెల 26న మంగళగిరి మండలం నవులూరు గ్రామ పరిధిలోని క్రికెట్ స్టేడియం వెనుక ముళ్ల పొదల్లో గుర్తు తెలియని పురుషుని మృతదేహం ఉన్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. వీఆర్‌వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పక్కన లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు సీతారామాంజనేయులుగా గుర్తించిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో మృతుని భార్య లక్ష్మి, సోదరుడు దుర్గా ప్రసన్న, అతని స్నేహితులు పరారీలో ఉన్నట్టు గుర్తించారు. అనుమానంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా దుర్గా ప్రసన్న, లక్ష్మిల మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధం తెలిసింది.
తన సోదరునితో భార్య వివాహేతర సంబంధం తెలిసి సీతారామాంజనేయులు తరచూ గొడవకు దిగుతుండటంతో భర్తను అడ్డు తొలగించుకోవటానికి ఒక పథకం ప్రకారం గత నెల 21వ తేదీ రాత్రి 8.15 గంటల సమయంలో స్టేడియం వద్ద ఆటోలో ఒంటరిగా కూర్చున్న సీతారామాంజనేయుల్ని భార్య లక్ష్మి, అన్న దుర్గాప్రసన్న, అతని స్నేహితులు తోడేటి నాగరాజు, పసుపులేటి హరికృష్ణ కలసి బలవంతంగా బయటకు లాగి గొంతు నులిమి, పిడి గుద్దులు గుద్ది చంపారు. అనంతరం శవాన్ని స్టేడియం వెనుక ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి తుమ్మచెట్టుకి టవల్‌తో ఉరి వేశారు. ముళ్లపొదల్లో మృతదేహాన్ని పోలీసులు గత నెల 26 న గుర్తించి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతుని వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా చేసిన దర్యాప్తులో హత్య విషయం వెల్లడైంది.
వెలుగులోకి రెండో హత్య
సీతారామాంజనేయులు హత్య కేసులో నిందితులను విచారించగా మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పిడుగురాళ్లకు చెందిన చిన్నాతో కలసి మృతుడు సీతారామాంజనేయులు, తోడేటి నాగరాజు గతంలో కొన్ని నేరాలు చేశారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో చిన్నా నాగరాజును చంపుతానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 18న గుంటూరు నగరంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలోని ఓ రూమ్‌కు పిలిపించి నాగరాజు, సీతారామాంజనేయులు కలసి చిన్నాను హత్య చేశారు. చిన్నా మృతిపై నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హత్యకు సాయం చేసిన సీతారామాంజనేయులు ఎక్కడ భయపడి విషయం బయటపెడతాడోనని అతన్ని హతమార్చడానికి నాగరాజు సీతారామాంజనేయులు అన్న దుర్గా ప్రసన్నకు సహకరించాడు. జిల్లా పోలీస్ కార్యాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. చిన్నా మృతదేహాన్ని వెలికితీసి రెవెన్యూ అధికారుల సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. విచారణలో ప్రతిభ కనపరిచిన సీఐ పి.శేషగిరిరావు, ఎస్‌ఐ, ఇతర సిబ్బందిని అభినందించి, రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ గంగాధరం, డీఎస్పీ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment