
కన్న కూతురిపైనే కన్నేయడాన్ని సహించలేక..
కర్ణాటకలో దృశ్యం తరహా ఘటన
దొడ్డబళ్లాపురం: భార్యను పరుల పడకలోకి వెళ్లాలని వేధించడమే కాక.. కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక భర్తను భార్యే హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి మాయం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉమరాణి గ్రామ నివాసి శ్రీమంత ఇట్నాళ (35), భార్య సావిత్రి కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. డబ్బుల కోసం సావిత్రిని పరాయి పురుషులతో పడుకోవాలని శ్రీమంత బలవంతం చేసేవాడు. దీంతో ఆమె భర్త దూరం పెట్టసాగింది.
తనను నిత్యం అదే తరహాలో వేధించడమే కాకుండా.. ఇటీవల కన్న కూతురిపైనే శ్రీమంత అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సావిత్రి బండరాయితో బాది భర్తను హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చిన్న డ్రమ్ములో వేసి ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసింది. భర్త దుస్తులను కాల్చివేసింది. హత్యకు ఉపయోగించిన బండరాయిని కడిగి షెడ్‌లో దాచిపెట్టింది. కాగా గురువారం శ్రీమంత మృతదేహం ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయటపడింది. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సావిత్రి ఒప్పుకుంది.