
కర్ణాటక (దొడ్డబళ్లాపురం) : ప్రేమించుకుని పెద్దలను కూడా ఎదిరించి పెళ్లి చేసుకుందో యువ జంట. అయితే ఆర్థిక సమస్యలకు భయపడి భర్త ఆత్మహత్య చేసుకోగా, పతీ వియోగాన్ని తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటన రామనగర తాలూకాలో చోటుచేసుకుంది. వివరాలు.. రామనగర తాలూకా తిమ్మసంద్ర గ్రామానికి చెందిన శివరాజు (27) ఆటోడ్రైవర్. పక్క గ్రామం అరళీమరదొడ్డికి చెందిన నవ్య (20)ను ఒకటిన్నర సంవత్సరం క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దంపతులు తిమ్మసంద్రలో నివసించేవారు. శివరాజ్ ఆటో నడుపుతుంటే, నవ్య గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్లేది.
భార్యను డ్యూటీకి వదిలి..
ఆదివారం ఉదయం భార్యను గార్మెట్స్ ఫ్యాక్టరీకి వదిలి ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రమైన అప్పుల బాధే ఇందుకు కారణమని తెలిసింది. అంత్యక్రియలు ముగిశాక నవ్యను ఆమె తల్లితండ్రులు ఇంటికి తీసికెళ్లారు. భర్త మరణాన్ని తట్టుకోలేని నవ్య పుట్టింట్లో సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని తనువు చాలించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.