ఐదురోజుల క్రితం బాలికను హతమార్చిన నిందితుడు
ప్రేమ నిరాకరించి, జైలుకు పంపిందని బాలికపై పగ
మృతురాలి ఇంటి సమీపంలోని గడ్డిదుబ్బులో బలవన్మరణం
రాంబిల్లి (అచ్యుతాపురం): తన ప్రేమను నిరాకరించి, జైలుకు పంపిందనే పగతో 14 ఏళ్ల బాలికను ఐదురోజుల క్రితం హతమార్చిన ప్రేమోన్మాది చివరకు శవమై కనిపించాడు. అతని మృతదేహం బాలిక ఇంటి సమీపంలోని గడ్డిదుబ్బుల్లో లభ్యమైంది. అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కొప్పుగొండుపాలెంలో బద్ది దర్శిని(14) అనే బాలికను ఈనెల 6వ తేదీ రాత్రి కశింకోట మండలానికి చెందిన సురేశ్ గొంతు కోసి హతమార్చాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్న అతనిపై దర్శిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. బాలికను రాంబిల్లి మండలంలో అమ్మమ్మ ఇంట చదివిస్తున్నారు.
బెయిల్‌పై వచ్చిన సురేశ్, తనను జైలుకు పంపిందన్న కక్షతో దర్శినిని హతమార్చాడు. ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన లేఖలో ‘ఇద్దరం కలిసి ఉండాలి.. లేదా ఇద్దరం చనిపోవాలి’ అని పేర్కొన్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికి జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంటికి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో కొండలాంటి ప్రాంతంలో గడ్డిదుబ్బుల మాటున సురేశ్ శవమై కనిపించాడు. బుధవారం సాయంత్రం అక్కడికి సమీపంలోని రైతులకు దుర్వాసన వచ్చింది. అప్పటికే చీకటి పడటంతో మరుసటిరోజు ఉదయం పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు నేతృత్వంలోని బృందం శవాన్ని పరిశీలించి లభించిన ఆధారం మేరకు సురేశ్‌గా నిర్థారించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. సురేశ్ జేబులో కొంత నగదు, రాసిన లేఖ జిరాక్స్ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తున్న సమయంలో ఆ వాహనాన్ని దర్శిని కుటుంబీకులు అడ్డుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే... బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించి, బాలిక కుటుంబాన్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిందితుడు మళ్లీ బాలిక వెంట పడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు రాంబిల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని, దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఘటన జరిగిన మర్నాడు అనకాపల్లిలో హోంమంత్రి అనితను విలేకరులు ప్రశ్నించగా, అలాంటిది జరిగినట్టు తన దృష్టికి రాలేదని, అదే నిజమైతే సంబంధిత పోలీస్ సిబ్బందిపై చర్యలు చేపడతామని చెప్పారు. చివరకు రాంబిల్లి ఎస్‌ఐ ముకుందరావును బుధవారం వీఆర్‌పై పంపారు. ఇంత జరిగినా బాలిక కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment