అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను పోర్న్ భూతం చిదిమేస్తోంది.. అరచేతిలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ అశ్లీల సైట్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది.. కల్లాకపటం ఎరుగని పిల్లల మనసులో కల్మషం నింపుతోంది.. ఆన్‌లైన్ క్లాసుల కోసం అందించిన సెల్‌ఫోన్ పసి హృదయాలపై నీలి చిత్రాల విషం చిమ్ముతోంది.. పోర్న్ వీక్షణం లేత వయసులోనే వ్యసనంగా మారుతోంది. బిడ్డల బంగారు భవితను నిర్ధాక్షిణ్యంగా కాలరాచేస్తోంది.. ముఖ్యంగా నూనూగు మీసాల ప్రాయం మహమ్మారికి బానిసగా మారుతోంది. ఈ తరుణంలో తల్లిదండ్రులు మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరముందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.
చదవండి: పిల్లలు పుట్టడం లేదని బొడ్డుపేగు తిన్న వివాహిత.. ఆ తర్వాత..
పలమనేరుకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ నెల 14వ తేదీన ఇద్దరు బాలురు (13, 14 ఏళ్లు) ఓ బాలిక(12)పై లైంగిక దాడికి యత్నించారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం చేపట్టిన విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేరానికి పాల్పడిన పిల్లలు సెల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోలను చూసేవారని తేలింది. నీలి చిత్రాల వీక్షించే ఈ బాలురు పెడదోవ పట్టినట్లు తెలిసింది.
చిత్తూరు కలెక్టరేట్: నేటి సమాజంపై పోర్న్ సైట్లు విష ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా యువతను బానిసలుగా మార్చుకుంటున్నాయి. కట్టుదప్పిన బాల్యాన్ని సులువుగా లొంగదీసుకుంటున్నాయి. ఈ సైట్‌లను చూసే వారిలో 20 ఏళ్ల లోపు వారే అధికంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 15 ఏళ్ల లోపు వారిలో 70శాతం మంది పోర్న్ మత్తులో చిక్కినట్లు వివరిస్తున్నాయి. పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలను మించి నీలి చిత్రాలను చూడడం పెద్ద వ్యసనంగా మారుతోందని పేర్కొంటున్నాయి.
జాగ్రత్తలు తప్పనిసరి
యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక వైద్య నిపుణులు కోరుతున్నారు. టీనేజ్‌లోకి అడుగుపెట్టిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో పిల్లలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని, ప్రత్యేక గుర్తింపు కోసం తహతహలాడుతుంటారని, స్నేహితులకు అధిక ప్రాధాన్యమిస్తుంటారని తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో వారికి సెల్‌ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే పోర్న్‌సైట్‌లకు సులువుగా అలవాటు పడతారని హెచ్చరిస్తున్నారు.
స్నేహ హస్తం అందించాలి
టీనేజ్ పిల్లలు వయసు ప్రభావంతో సహజసిద్ధంగా వచ్చే శారీరక, మానసిక పరిణామాలను అర్థం చేసుకోలేక తీవ్రమైన అలజడికి గురవుతారు. ఈ దశలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలవాలి. వారి సమస్యలను ఓపికగా విని అర్థం చేసుకుని పరిష్కరించేందుకు యత్నించాలి. మాట వినడంలేదని కఠినంగా వ్యవహరించకూడదు. వారి తప్పులను గుర్తించి సున్నితంగా హెచ్చరించాలి.
లోపించిన పర్యవేక్షణ
తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం వల్లే పిల్లలు కట్టుదాటుతున్నారు. అశ్లీల చిత్రాలను వీక్షించి విపరీత పోకడలకు అలవాటు పడుతున్నారు. ఉన్నత భవిష్యత్‌ను పణంగా పెట్టి పోర్న్ మహమ్మారి వలలో చిక్కుతున్నారు. ఆన్‌లైన్ మాయలో పడి జీవితాన్ని అంధకారబంధురం చేసుకుంటున్నారు.
బ్రౌజింగ్ వ్యసనం
ప్రస్తుత సమాజంలో యుక్తవయసు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరగకపోవడం పలు అనర్థాలు హేతువుగా నిలుస్తోంది. పిల్లలను చిన్న తరగతుల్లోనే హాస్టళ్లలో చేరి్పంచడం వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత విద్యావిధానంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లోనూ స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా మారింది. ఆన్‌లైన్ క్లాసుల కోసం పిల్లల చేతికి ఫోన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా బ్రౌజింగ్ వ్యసనంగా మారింది. తల్లిదండ్రులు ఏమాత్రం అలసత్వం వహించినా అది పిల్లల భవితకు శాపంగా మారే ప్రమాదముంది.
నిబంధనలు పాటించాలి
ఇంటర్నెట్ సెంటర్లలోపోలీసు శాఖ సూచించే నియమ నిబంధనలను పాటించాలి. మైనర్లను తల్లిదండ్రులు లేకుండా ఇంటర్నెట్ సెంటర్లలోకి అనుమతించకూడదు. ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. చిన్నారులు, విద్యార్థులు సెల్‌ఫోన్లకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేకశ్రద్ధ వహించాలి. అత్యవసరమైతే తప్ప మొబైల్ డేటా వేయకపోతే మంచిది.
పిల్లలతో ఎక్కువసేపు గడిపేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి. క్రీడలు, సంగీతం వంటి వాటిపై ఆసక్తిని పెంపొందించాలి. ఫోన్ ఇచ్చేటప్పుడు పిల్లలకు అవసరమైన యాప్‌లను మాత్రమే అందుబాటులో ఉంచాలి. ఎడ్యుకేషన్ యాప్స్, పిల్లల కథలు, పాటలు వంటి వాటిని మాత్రమే సెట్ చేసి ఇవ్వాలి. యాప్‌లకు లాక్‌లు పెట్టి ఇస్తే వారు ఏ ఇతర వివరాలను చూసేందుకు వీలు ఉండదు.
అవగాహన లోపంతోనే..
అవగాహన లేకనే పిల్లలు పెడదారి పడుతున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసుల కారణంగా అందరి దగ్గరా సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. దీంతో విద్యార్థులకు సోషల్‌మీడియా చూడడం వ్యసనంగా మారుతోంది. ఈ క్రమంలోనే పోర్న్‌సైట్‌లకు సైతం అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సెల్‌ఫోన్ ఇచ్చేటప్పుడు అన్‌వాంటెడ్ బ్రౌజింగ్ చేయకుండా లాక్ చేసివ్వాలి.
– జయకుమార్, సైకాలజిస్ట్, మదనపల్లె
నెట్ సెంటర్లపై నిఘా
నెట్ సెంటర్లపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల విషయంలో తల్లిదండ్రులు నియంత్రణ చర్యలు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్‌లో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు సెల్‌ఫోన్ ఇవ్వకపోవడం మంచిది. ఫోన్‌లో విద్యార్థులకు అవసరమైన యాప్స్ మాత్రమే అందుబాటులో ఉంచాలి.
– రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె
Comments
Please login to add a commentAdd a comment