సాక్షి, చొప్పదండి: రెండు రోజుల్లో పెళ్లి.. కొత్త జీవితం ప్రారంభించాల్సిన ఓ యువకుడిని విధి విద్యుదాఘాతం రూపంలో బలి తీసుకొని పెళ్లింట తీరని విషాదం నింపింది.. గతంలో వివాహం జరగకుండానే మొదటి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు పెళ్లికి ముందే రెండో కుమారుడూ అనంతలోకాలకు వెళ్లడం ఓ తాపీ మేస్త్రీ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఎస్సై వంశీకృష్ణ కథనం ప్రకారం.. కమ్మర్‌ఖాన్‌పేటకు చెందిన పులిపాక అంజయ్య తాపీ మేస్త్రీగా పని చేస్తూ భూపాలపట్నం రోడ్డులోని చర్చి ముందు వీధిలో నివాసం ఉంటున్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటుండగా కుమారుడు పులిపాక హరీష్(27) చొప్పదండిలోని డిష్ ఆపరేటర్ వద్ద కేబుల్, రీచార్జి పనులు చేస్తున్నాడు. ఇతనికి బుధవారం వివాహం జరగాల్సి ఉంది.
ఈ క్రమంలో సోమవారం ఉదయం భూపాలపట్నం రోడ్డులో అంబేద్కర్ చౌరస్తా సమీపంలో గల ట్రాన్స్‌ఫార్మర్ వద్ద డిష్ వైరు సరి చేస్తుండగా, మెయిన్ లైన్ మూలంగా విద్యుదా ఘాతం సంభవించి, కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు తమ వాహనంలో నగునూరులోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
గతంలో అన్న.. ఇప్పుడు తమ్ముడు
అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా, కూతురుకి పెళ్లి చేశాడు. పెద్ద కుమారుడు నరేష్ గతంలో రోడ్డు ప్రమాదంలో, చిన్న కుమారుడు హరీష్ ఇప్పుడు విద్యుదాఘాతంతో మృతిచెందారు. కుమారులిద్దరూ పెళ్లి కాకుండానే చనిపోవడంతో బాధిత కుటుంబీకులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. వీరి తల్లి కూడా గతంలోనే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
రాఖీ కట్టలేకపోయిన సోదరి
రాఖీ పండుగ సందర్భంగా తనకు మిగిలిన ఒక్కగానొక్క సోదరుడికి రాఖీ కట్టాలని హరీష్ సోదరి పుట్టింటికి వచ్చింది. కానీ అతను కేబుల్ పనికి వెళ్లి చనిపోవడంతో తాను రాఖీ కూడా కట్టలేక పోయానని ఆమె రోదించింది.
Comments
Please login to add a commentAdd a comment