ప్రతీకాత్మక చిత్రం
సూర్యాపేట క్రైం : జాజిరెడ్డిగూడెం జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ను మట్టుబెట్టుందుకు సుపారీ తీసుకున్న ఓ ముఠాను ముందస్తుగా అరెస్టు చేసినట్లు హత్యాయత్నాన్ని భగ్నం చేసినట్లు సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలతోనే జెడ్పీటీసీని సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించేందుకు ఇద్దరు సమీప బంధువులతో పాటు మరొకరు కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. సూత్ర, పాత్రధారుల్లో నలుగురిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారన్నారు. బుధవారం సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన దావుల వీరప్రసాద్ యాదవ్, ముదిరాజ్ కులానికి చెందిన లింగంపల్లి జగన్నాథం రెండో భార్య కూతురు మనీషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం జగన్నాథం అనారోగ్యంతో చనిపోగా తలగొరివి పెట్టే విషయంలో గొడవ జరిగింది. జగన్నాథం పెద్ద భార్య కుమార్తె కవితతో తలగొరివి పెట్టించాలని అనుకోగా రెండవ భార్య కుమార్తె శ్వేతతో తలగొరివి పెట్టించారు. అప్పటి నుంచి జగన్నాధం అన్న కొడుకు లింగంపల్లి సుధాకర్, అతడి బంధువులు, వీరప్రసాద్‌కు మనస్పర్థలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి.
కుటుంబ విషయాల్లో తలదూరుస్తూ..
దావుల వీరప్రసాద్ తరచూ జగన్నాథం కుటుంబ విషయాల్లో తలదూరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరప్రసాద్ కొద్దిరోజుల క్రితం తోడల్లుడు జిన్నే శ్రీను, అతడి కుమారుడు అశ్విన్‌లపై అర్వపల్లి కి చెందిన మేకల సంతోష్‌పై జరిగిన దాడి విషయంలో తప్పుడు కేసులు పెట్టించాడు. దీంతో వారు జెడ్పీటీసీపై కోపం పెంచుకున్నారు. దీంతో పాటు ఇదే గ్రామానికి చెందిన లింగంపల్లి సంజయ్ 3 గుంటల భూమి పంచాయితీలో దావుల వీరప్రసాద్ తలదూర్చి భూమి రాకుండా అడ్డుపడినట్లు అనుమానం పెంచుకున్నారు. మూసీ మాజీ చైర్మన్ అలువాల వెంకటస్వామి ఇంటిపై కూడా బండి సంజయ్ గ్రామానికి వచ్చిన సమయంలో దావుల వీరప్రసాద్ అనుచరులు గొడవ చేశారని కక్ష పెంచుకున్నారు.
అడ్డు తొలగించుకోవాలని..
ప్రతి విషయంలో అడ్డుతగులుతున్న వీరప్రసాద్ మట్టుబెట్టాలని లింగంపల్లి సుధాకర్, జిన్నే శ్రీను, అలువాల వెంకట స్వామి నిర్ణయించుకున్నారు. అందుకు కిరాయి హంతకుడు ప్రస్తుతం పూణేలో ఉంటున్న బంధువు లింగంపల్లి సంజయ్‌ను సంప్రదించారు. అతడి ద్వారా రౌడీ షీటర్ పోతురాజు సైదులుతో ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 22న జనగాం క్రాస్ రోడ్డులోని ఓ బార్‌లో జిన్నా శ్రీను మినహా మిగిలిన నలుగురు కలిసి హత్యకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా పట్టణంలోనే మారణాయుధాలు కొనుగోలు చేశారు.
గంజాయి విక్రయిస్తున్నారని..
పట్టణంలోని సీతారాంపురం కాలనీలోని రౌడీ షీటర్ పోతరాజు సైదులు ఇంట్లో గంజాయి కలి గిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్న సమాచారంపై బుధవారం సీఐ అర్కపల్లి ఆంజనేయులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ లింగంపల్లి సుధాకర్, లింగంపల్లి సంజయ్, పోతరాజు సైదులును అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి, రెండు వేట కొడవళ్లు, కంకి కొడవలి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్కడే ఉండగా అలువాల వెంకట స్వామి మారుతీవ్యాన్‌లో రావడంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. వ్యాన్‌ను సోదా చేయగా కత్తి లభించింది. వ్యాన్‌తో పాటు మారణాయుధాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా హత్యకుట్ర విషయం బయటపడిందని తెలిపారు. కాగా, ఈ కేసులో జిన్నా శ్రీను పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన టౌన్ సీఐ అర్వపల్లి ఆంజనేయులు , ఎస్‌ఐ శ్రీనివాస్, చివ్వెంల ఎస్‌ఐ విష్ణు, ఐటీ కోర్ ఎస్‌ఐ శివ కుమార్, క్రైం సిబ్బంది గొర్ల కృష్ణ, గోదేషి కరుణాకర్, సైదులు, శ్రవణ్, మల్లేశ్‌లను ఎస్పీ అభినందించారు.
చదవండి: ‘ఇప్పటికే ఇద్దరాడపిల్లల్ని కన్నాను’..! రోజుల పసికందును చంపిన తల్లి..
Comments
Please login to add a commentAdd a comment