రావులపాలెం మండలం గోపాలపురంలోని వశిష్ట గోదావరిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు
ఇసుక దోపిడీకి కూటమి నాయకుల పోటాపోటీ
యథేచ్ఛగా అక్రమ తరలింపు
ఉచితం మాటున అక్రమార్జన
పట్టించుకోని అధికారులు
రావులపాలెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక మాటున కూటమి నాయకులు దోపీడీకి పాల్పడుతున్నారు. యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేస్తూ అక్రమార్జనలో పోటీ పడుతున్నారు. ప్రజలు తమ అవసరాల నిమిత్తం ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ప్రకటనతో వీరు మరింత విజృంభించారు. ముఖ్యమంత్రి ప్రకటనతో సామాన్యులకు ఎంత లాభం కలిగిందో తెలియదు గానీ కూటమి నాయకులకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. నిబంధనలను తొంగలోకి తొక్కి కూటమి నాయకులు ఇసుక తవ్వకాలను నడిపిస్తున్నారు. రావులపాలెం మండలం గోపాలపురం పాత ఇసుక ర్యాంపు బాటలో మంగళవారం వందల ట్రాక్టర్లతో అక్రమ తవ్వకాలకు తెరలేపారు.
ట్రాక్టర్ ఇసుక రూ.600
ప్రభుత్వం ఉచిత ఇసుకను ప్రకటించడంతో పాటు సీనరీజ్‌ను రద్దు చేసింది. అయితే గోపాలపురంలో ట్రాక్టర్ ఇసుకకు రూ.600 వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.350 కూలీలకు కేటాయించగా, రూ. 250 బాట నిర్వహణ పేరుతో కూటమి నాయకులు జేబులు నింపుకొంటున్నారు. అయితే బాట నిర్వహణకు రూ.50 కేటాయించినా మిగిలిన రూ. 200లో రూ.100 బీ టాక్స్, మరో రూ.100 గ్రామానికి చెందిన నాయకుడికి ఏ టాక్స్‌గా కేటాయించినట్లు తెలుస్తుంది. ఒక్క రోజులోనే సుమారు 600 ట్రాక్టర్లకు ఎగుమతి చేయగా కూలీలకు కేటాయించిన సొమ్ము కాకుండా నాయకుల జేబుల్లోకి సుమారుగా రూ.1,50,000 వరకు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.
సీఆర్‌జెడ్ పరిధిలో తవ్వకాలు
ఇటీవల కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలోకి మండలంలోని గోపాలపురం, కొమరాజులంక, ముమ్మిడివరప్పాడు, రావులపాలెం గ్రామాలు చేరాయి. వీటిలో అక్రమ మైనింగ్ తవ్వకాలు చేపట్టకూడదంటూ నిబంధనలు ఉన్నాయి. ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా సాండ్ కమిటీ ఆయా ఊర్లను మినహాయించి, మిగిలిన గ్రామాలైన పొడగట్లపల్లి, ఊబలంక గ్రామాల్లో ఇసుకర్యాంపుల నిర్వహణకు పరిశీలన చేసింది. గోదావరిలో నీటి ప్రవాహం ఉండడంతో మరో పది రోజులు సమయం పడుతుందని అధికారులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో గోపాలపురంలో పాత ఇసుక ర్యాంపులో ఇసుక మేటలు తేలడంతో కూటమి నాయకులు వాటిని సొమ్ము చేసుకునేందుకు నిబంధనలు లెక్కచేయకుండా తవ్వకాలు చేపట్టారు. స్థానిక కూటమి నాయకుల ట్రాక్టర్లకు పదుల సంఖ్యలో ట్రిప్పులు ఇస్తున్నారని, గృహ అవసరాల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి తెచ్చుకున్న తమ ట్రాక్టర్లకు ఒక ట్రిప్పు మాత్రమే ఇచ్చారంటూ పలువురు ట్రాక్టర్ డ్రైవర్లు చెబుతున్నారు. గ్రామానికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర నాయకుడి అనుచరులు ఈ దందాకు తెరలేపారు. ఒక్కరోజులోనే రూ.లక్షల్లో జేబులు నింపుకొన్నారు. లారీ ఇసుకను రూ.20 వేలకు పైగా విక్రయిస్తూ అక్రమార్జనకు బాటలు వేసుకున్నారు.
దోపిడీకి తెర
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రావడంతో ఇదే వంకతో కూటమి నాయకులు ఇసుక దోపిడీకి తెర తీశారు. అధికారులు కోడ్ హడావుడిలో ఉంటారని, తమకు అడ్డు చెప్పేవారే ఉండరని భావించి అక్రమ తవ్వకాలకు బాటలు వేశారు. గోపాలపురంలో నిబంధనలను సైతం తుంగలోకి తొక్కి ఇసుక తవ్వకాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment