తూర్పు గోదావరి: ఏడడుగులు.. మూడు ముళ్లతో ఒక్కటవ్వాల్సిన బంధం వారిది.. నిండు నూరేళ్లూ కలసి జీవించాల్సిన ఆ జంట కాళ్లకు పెళ్లి పారాణి వేయక ముందే అనంత లోకాలకు వెళ్లిపోయింది.. ఒకేసారి వారిద్దరినీ మృత్యువు వెంటాడింది.. చెట్టాపట్టాలు వేసుకుని కొత్త బంగారు లోకంలో విహరిస్తూండగా లారీ రూపంలో వెనుక నుంచి మృత్యువు వెంటాడింది. పెళ్లితో ఒక్కటి కావాల్సిన వారు మృత్యువులోనూ ఒక్కటై వెళ్లిపోయారు.
రాజమహేంద్రవరం సమీపాన కొంతమూరు గామన్ బ్రిడ్జి రోడ్డులోని వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో ఓ జంట దుర్మరణం పాలైంది. మరో 15 రోజుల్లో పెళ్లి చేసుకుని నూరేళ్లు జీవించాల్సిన కాబోయే వధూవరులను మృత్యువు వేటాడింది. జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామానికి చెందిన మానేపల్లి రాజ్‌కుమార్ (24), కిర్లంపూడి మండలం సోమవరం గ్రామానికి చెందిన దుర్గా పావని (18)లకు పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి పనుల్లో భాగంగా 4న పసుపు దంచే ప్రక్రియ పూర్తి చేశారు. వచ్చే నెల 10న పెళ్లి చేసేందుకు పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. ఈ పెళ్లి పనుల్లో ఇరు కుటుంబాలూ నిమగ్నమయ్యాయి. ఇరు ఇళ్లలోనూ బంధువుల సందడి నెలకొంది.
మా పెళ్లికి రారండి అంటూ..
కాబోయే భార్యాభర్తలు రాజ్‌కుమార్, దుర్గాపావనిలు ఇప్పటికే తమ పెళ్లి రావాలంటూ బంధువులు, స్నేహితులను ఆహ్వానించారు.. మా పెళ్లికి రండి.. మమ్మల్ని ఆశీర్వదించడంటూ నవ్వుతూ పిలిచారు. ఇదిలా ఉండగా వారిద్దరూ మంగళవారం వీరవరంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. అనంతరం వారి పెళ్లికి సంబంధించిన సామగ్రి తీసుకోవడానికి రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తున్నారు. కొంతమూరు గామన్ బ్రిడ్జి రోడ్డులోని వంతెన వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వారి బైక్‌ను ఢీకొంది. వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. శుభకార్యం జరగాల్సిన ఇళ్లలో ఈ మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయాయి. ఆ వార్త నిజం కాకుండా ఉంటే బాగుండునని వారిలో వారే మధనపడ్డారు.
ఒక ఇంటివాడు కావాలని..
జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామానికి చెందిన మానేపల్లి వెంకటేశ్వరరావు, లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తెకు పెళ్లి కాగా, చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. మరో కుమారుడు, మృతుడు రాజ్‌కుమార్ తాపీమేస్త్రిగా పని చేస్తూ ఆ కుటుంబానికి కొండంత భరోసా ఉన్నాడు. ఈ మధ్యే జగనన్న ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణ పని ప్రారంభించాడు. పెళ్లి కాబోతున్న నేపథ్యంలో ఓ ఇంటివాడూ కావాలనే ఆశతో ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. కలల సౌథం నిర్మించుకోవాలని ఆశ పడ్డాడు. ఇదిలా ఉంటే మే 4న పెళ్లి పనులకు సంబంధించి పసుపు కొట్టే వేడుకలకు అతని తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. తన కొడుకు పెళ్లి చూడకుండా ఇలా వెళ్లిపోయాడంటూ ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
వేడుకగా పెళ్లి చేద్దామని..
కిర్లంపూడి మండలం సోమవరం గ్రామానికి చెందిన మలికిరెడ్డి సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మలిరెడ్డి దుర్గాపావని (18) పదో తరగతి వరకూ చదివింది. చిన్న కుమార్తె ఇంకా విద్యనభ్యసిస్తోంది. సత్యనారాయణ స్టోన్ క్రసర్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తన మొదటి బిడ్డ పెళ్లి వేడుకగా చేసి అత్తారింటికి పంపుదామని అనుకున్న సమయంలో ఇలా జరగడంతో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించిందనే వార్త విని దుఖః సాగరంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment