
కాకినాడ: గవర్నర్ ఆమోదంతో శాసనమండలి సభ్యురాలిగా కర్రి పద్మశ్రీని ఖరారు చేస్తూ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటాలో ఆమెను ఈ పదవికి ఎంపిక చేశారు. ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న చడిపిరాళ్ళ శివనాఽథ్‌రెడ్డి, ఎన్‌ఎండి ఫరూఖ్ పదవీకాలం జూలై 20తో పూర్తికావడంతో కొత్త ఎమ్మెల్సీలను ప్రభుత్వం సిఫార్సు చేసింది. వాడబలిజ మత్స్యకార వర్గానికి చెందిన కర్రి పద్మశ్రీని ఎమ్మెల్సీగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడడంతో స్థానికంగా ఆమెను పలువురు నాయకులు, కార్యకర్తలు, వాడబలిజ మత్స్యకార ప్రతినిధులు అభినందించారు. ఆమెను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కౌడ చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి అభినందించారు.