తూర్పుగోదావరి: కొత్త సంవత్సరం ఆరంభం రోజునే తునిలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటలకు దిగారు. యనమల బ్రదర్స్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి.. డిష్యుం డిష్యుం అంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు.. తన కళ్ల ముందే తెలుగు ‘తమ్ముళ్లు’ అరుపులు, కేకలతో.. ముష్టిఘాతాలతో ఫైటింగ్‌కు దిగినా.. ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు సైలెంటుగా ఉండిపోవడం చూపరులను విస్మయపరచింది.
తన వరకూ వస్తేనే కానీ తత్త్వం బోధపడదంటారు పెద్దలు. ప్రజాదరణ కోల్పోయి, అధికారానికి దూరమై ఏళ్లు గడుస్తున్నా పార్టీలో గ్రూపులను కట్టడి చేయలేని దుస్థితిని తెలుగుదేశం అగ్ర నేతలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలకు ఆది గురువుగా విమర్శలు ఎదుర్కొనే శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు దాదాపు అటువంటి పరిస్థితే ఎదురైంది.
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆయన.. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఆధిపత్యం కోసం.. ఇటు కాకినాడ మెట్ట ప్రాంతం, అటు కోనసీమలో గ్రూపులను పెంచి పోషిస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, దివంగత నేతలు మెట్ల సత్యనారాయణరావు, బొడ్డు భాస్కర రామారావులను గ్రూపులుగా చేసి, ఉమ్మడి జిల్లాపై పెత్తనాన్ని చెలాయించిన చరిత్ర రామకృష్ణుడు సొంతమనే వారు ఆ పార్టీలో కోకొల్లలు. ఇన్నేళ్ల పాటు తాను పెంచి పోషించిన గ్రూపు రాజకీయాలు.. తీరా సొంత నియోజకవర్గం తునిలో భగ్గుమనేసరికి రామకృష్ణుడికి దిక్కుతోచడం లేదనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది.
రగులుతున్న కృష్ణుడి వర్గం
సొంత కుమార్తె దివ్యను తన రాజకీయ వారసురాలిగా చేసేందుకు.. మూడు దశాబ్దాలుగా తన వెంట నడిచిన వరుసకు సోదరుడైన యనమల కృష్ణుడిని బలవంతంగా టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి రామకృష్ణుడు తప్పించారు. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను దివ్యకు అప్పగించారు. ఆమెకు పార్టీలో ఎదురుండకూడదనే ఉద్దేశంతో కృష్ణుడిని వ్యూహాత్మకంగానే తప్పించారని ఆయన వర్గం కొంత కాలంగా రగిలిపోతోంది. దివ్యకు పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించడంపై కినుక వహించిన కృష్ణుడు.. కొంత కాలం అలకబూనారు. రాజకీయంగా పక్క చూపులు చూశారు.
ఆ సమయంలో నియోజకవర్గ బాధ్యతలను రామకృష్ణుడి సొంత సోదరుని కుమారుడు రాజేష్ తన భుజాన వేసుకున్నారు. విధి లేని పరిస్థితుల్లో కృష్ణుడు టీడీపీలో తిరిగి క్రియాశీలకంగా మారారు. పార్టీపై పెత్తనం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అప్పటికే దివ్య కనుసన్నల్లో నియోజకవర్గ బాధ్యతలను కృష్ణుడు చూస్తున్నా.. టీడీపీ తొండంగి మండల బాధ్యతలు మాత్రం రాజేష్ చేతుల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కృష్ణుడి వర్గానికి ఇది అవమానంగానే అనిపించింది. దీంతో ఆ వర్గం సమయం కోసం వేచి చూస్తోంది.
ముందస్తు వ్యూహమేనా..!
రాజేష్‌ను ఎంత మాత్రం భరించలేని కృష్ణుడు నయాన భయాన ఆయనను పార్టీకి దూరం చేసేందుకు కొంతకాలం నుంచి ఎత్తుగడలు వేస్తున్నారు. దీనిలో భాగంగానే తొలి ప్రయత్నంగా సోమవారం జరిగిన నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకున్నారు. రామకృష్ణుడు కళ్లెదుటే రచ్చరచ్చ చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే కృష్ణుడు తన అనుచరులతో రాజేష్‌పై దాడి చేయించారని టీడీపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
తన్నుకున్నారిలా..
తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద సాయి వేదికలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఇందులో యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పలు గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు వచ్చారు. వారు వరుస క్రమంలో వెళ్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో రామకృష్ణుడి సొంత అన్న కుమారుడు రాజేష్ అక్కడకు చేరుకున్నారు. రామకృష్ణుడిని, దివ్యను కలిసేందుకు క్యూతో ప్రమేయం లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అదను కోసం వేచి ఉన్న కృష్ణుడి వర్గీయులు దీనిని అవకాశంగా మలచుకున్నారు.
అందరూ క్యూలోనే రావాలంటూ అక్కడున్న వారిని అప్పటికే వారు కట్టడి చేస్తున్నారు. ఈ సమయంలో రాజేష్ క్యూలో కాకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిని కృష్ణుడి వర్గం లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా దాడులకు దిగింది. రాజేష్‌పై ఆయన సొంత చిన్నాన్న రామకృష్ణుడు, దివ్య సమక్షంలోనే పిడిగుద్దులతో ఈ దాడి జరిగింది. అయినప్పటికీ రామకృష్ణుడి అనుచరులు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇరు వర్గాలకూ సర్ది చెప్పలేక, వారిని కట్టడి చేయలేక నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుండిపోయారు.
ఆయన సైలెంటుగా ఉండిపోవడానికి కృష్ణుడు దూరమైతే రాజకీయంగా ఇబ్బంది పడతామనే భయం తప్ప మరొకటి కారణం కాదని పలువురు అంటున్నారు. కుమార్తె దివ్య ఇన్‌చార్జిగా ఉన్న సొంత నియోజకవర్గం తునిలోనే కళ్లెదుటే ఇంత జరిగినా.. చివరకు ఇరువర్గాలను సముదాయించడానికి తలప్రాణం తోకకొచ్చినట్టయ్యిందని అంటున్నారు. ఇన్నేళ్లూ పార్టీలో గ్రూపులను ప్రోత్సహించిన యనమల.. రక్త సంబంధీకులు, దాయాదుల పోరు, గ్రూపు రాజకీయాలు భగ్గుమనడంతో.. వాటి ప్రభావాన్ని స్వయంగా రుచి చూశారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
ఇవి చదవండి: దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. 'పరిటాల' ఓవరాక్షన్‌కు బ్రేక్..!
Comments
Please login to add a commentAdd a comment