రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవగాహనతో పాటు నియమాలు పాటించే చొరవ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన తొలి గంట గోల్డెన్ అవర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు అధ్యక్షతన జరిగింది. జేసీ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్త్రతంగా నిర్వహించాలన్నారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 27 జాతీయ, 6 రాష్ట్ర, 2 ఇతర రహదారులలో మొత్తం 35 బ్లాక్ స్పాట్స్‌లో గుర్తించామని, ఆయా ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగాయన్నారు. రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడానికి కావలసిన జాగ్రత్తలు పాటించాలన్నారు. బ్లాక్ స్పాట్లలో లైటింగ్, సైన్ బోర్డ్, బ్లింకర్స్ సిగ్నల్ , జీబ్రా లైన్‌న్స్ , స్పీడ్ బ్రేకర్ లాంటివి ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే చోట ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలపాలని, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారుల్లో కొన్ని ప్రదేశాల్లో ప్లాంటేషన్, లైటింగ్ చేపట్టాలన్నారు.
మోటార్ వాహనాల చట్టం పరిధిలో 2023 ఏడాదిలో 11,849 కేసులు నమోదు చేసి, రూ.10,32,72,000 జరిమానా విధించామని తెలిపారు. 2024లో 4,204 కేసులు నమోదు చేసి రూ.8,82,41,000 జరిమానా విధించామన్నారు. కోర్టు ఆధ్వర్యంలో 2023లో 45 కేసులకు రూ.67,500, 2024 లో 15 కేసులకు రూ.20 వేల అపరాధ రుసుం విధించినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన వ్యక్తిని గంటలోపు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తే విలువైన ప్రాణాలు దక్కుతాయని తెలిపారు. నేషనల్ హైవే హెల్ప్ లైన్ (ఎమర్జన్సీ) నంబర్ 1033 పై విస్త్రతంగా అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బ్లాక్ స్పాట్లలో లైటింగ్, సైన్ బోర్డ్,
బ్లింకర్స్ ఏర్పాటుకు చర్యలు
ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ కోసం
హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు
Comments
Please login to add a commentAdd a comment