కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం జరిగిన రాజమహేద్రవరం మెడికల్ కళాశాల ప్రథమ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కళాశాలలో గత ఏడాది వైద్య విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించడం శుభపరిణామమని అన్నారు. కష్టపడి చదివి, వైద్యులైన తరువాత అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ‘సౌభాగ్య రక్త మిత్ర‘ లోగోను కలెక్టర్ ఆవిష్కరించారు. ఒకరు రక్తాన్ని దానం చేయడం వలన ముగ్గురికి ప్రాణ దానం చేయవచ్చని అన్నారు. వైద్యాధికారులు, వైద్య విద్యార్థులతో రక్తదాన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.సూర్యప్రభ, వైస్ ప్రిన్సిపాల్, కె.శివప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ కె.సూర్యారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వీవీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.