రాజానగరం: హాస్టళ్లలో పని చేస్తున్న సిబ్బందితో పాటు ఉంటున్న విద్యార్థులు కూడా పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. వర్సిటీ ప్రాంగణంలోని బాలుర హాస్టల్‌ను శనివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. వంట గది, విద్యార్థులు భోజనం చేసే హాలు వంటి వాటిని పరిశీలించారు. హాస్టల్ నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. వీసీతో పాటు తనిఖీకి వచ్చిన రాజమహేంద్రవరం కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ మాట్లాడుతూ, హాస్టల్‌ను పరిశుభ్రంగా ఆహార పదార్థాల నాణ్యతను మెరుగుగా ఏవిధంగా ఉంచవచ్చునో సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ ఆచార్య ఎస్‌కే రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణ లక్ష్యం
2 లక్షల మెట్రిక్ టన్నులు ˘
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రస్తుత రబీలో జిల్లావ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. ధాన్యం సేకరణపై రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, తూనికలు – కొలతలు, రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టేక్ హోల్డర్లు, కస్టోడియన్ అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల ఒకటో తేదీ నాటికి జిల్లాలోని 216 రైతు సేవా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించి, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన గోనె సంచులు సిద్ధం చేయాలన్నారు. ధాన్యం సేకరణలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని జేసీ కోరారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి పౌర సరఫరాల అధికారి ఎస్.భాస్కర్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.రాధిక, ఇతర అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.
డొంకరాయి నుంచి
5 వేల క్యూసెక్కులు
సీలేరు: గోదావరి డెల్టాలో రబీ సాగుకు సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి జలాశయం నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని శనివారం నుంచి విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్‌కో అధికారులు తెలిపారు. గోదావరి డెల్టాకు సీలేరు జలాలు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు గత ఫిబ్రవరి 10న కోరారు. ఈ మేరకు డొంకరాయి నుంచి 5 వేలు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నామని జెన్‌కో అధికారులు వివరించారు. ఫిబ్రవరి 10 నుంచి శనివారం వరకూ గోదావరి డెల్టాకు 10.19 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఈ నెల 31 వరకూ నీటిని విడుదల చేయనున్నామని తెలిపారు.
హాస్టళ్లలో పరిశుభ్రత వ్యక్తిగత బాధ్యత