
గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం
నల్లజర్ల:మండలం దూబచర్లలో వైఎస్సార్ వసంత్‌నగర్ కాలనీలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి రెండుపోర్షన్ల షెడ్డు అగ్నికి ఆహుతి అయ్యింది. సుంకర సన్యాసమ్మ ఆదివారం ఉదయం టీకాచుకునేందుకు గ్యాస్ స్టౌ వెలిగించగా గ్యాస్ లీకై వ్యాపించిన మంటలలో ఇంటి సామగ్రి అంతా కాలి బూడిదైంది. ఆమె దాచుకున్న రూ.15 వేలు కళ్లముందే కాలిపోయాయి. పక్క పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న పగటి వేషాలు వేసే భైరవపాటి వెంకటేశ్వరావుకు చెందిన సౌండ్ సిస్టమ్, హోర్మోనియం, తబలా, మేకప్ దుస్తులు, రూ.25 వేల నగదు కాలి బూడిదయ్యాయి. మొత్తం రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్టు అంచనావేశారు. భీమడోలు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పంది సత్యనారాయణ, స్థానిక నాయకుడు చేబ్రోలు బాలాజీ తదితరులు పరామర్శించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ఇనుపగొట్టం పడి జట్టు కూలీ మృతి
అంబాజీపేట: జీవనోపాధి కోసం కూలి పనికి వెళ్లిన వ్యక్తి తలపై ఇనుప గొట్టం పడడంతో అతడు మృత్యువాత పడ్డాడు. పనికి వెళ్లి వస్తానని చెప్పి ఉదయమే వెళ్లిన కొద్ది గంటల్లోనే అతడు మృతి చెందాడన్న విషయం తెలియడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిరతపూడి గ్రామానికి చెందిన దారపురెడ్డి శ్రీనివాసు (పండు) (25) ఆదివారం అమలాపురంలో ఓ భవన నిర్మాణానికి జట్టు కూలీలతో కాంక్రీటు శ్లాబు కొట్టే పనికి వెళ్లి వెళ్లాడు. అక్కడ పనులు చేస్తున్న సమయంలో పై అంతస్తు నుంచి ఓ ఇనుప గొట్టం శ్రీనివాస్ తలపై పడింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 108 వాహనంలో అతనిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. మృతుడికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ మృతితో తల్లిదండ్రులు లక్ష్మణస్వామి, ధనలక్ష్మితో పాటు భార్య దుర్గ, కుమార్తె లహరి, కుమారుడు విశ్వాస్, బంధువులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం